పార్టీ కోసం పనిచేస్తేనే పదవులు… పదవులు ఉంటేనే పనిచేస్తాననటం కాదు అన్న మాటలు కాంగ్రెస్ లో జోరుగా వినిపిస్తాయి. కానీ ఆచరణలో పెట్టే నేతలే ఉండరు. ఓవైపు బీజేపీ, మరోవైపు టీఆర్ఎస్ లు కాంగ్రెస్ పార్టీ నాయకులపై కన్నేసి ఒక్కో నేతను ఎగురేసుకపోతున్న సందర్భంలో అసంతృప్త నేతలను బుజ్జగించే ప్రయత్నం ఏ ఒక్క నేత చేయటం లేదు. పీసీసీ, సీఎల్పీ లీడర్లు తమకు పట్టని వ్యవహారం అన్నట్లుగా లైట్ తీసుకుంటున్నారు.
కానీ రేవంత్ రెడ్డి మాత్రం సైలెంట్ గా ఉండకుండా అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో ఉన్నారు. గతంలో నేతలు పార్టీ మారిన సందర్భంలోనూ, ఇప్పుడు పార్టీ మారుతున్న నేతలతో భేటీ అవుతున్నారు. తాజాగా పాలమూరు జిల్లా నేత హర్షవర్ధన్ రెడ్డి ఇంటికి వెళ్లి, బుజ్జగించే ప్రయత్నం చేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ ను నడిపే నాయకులు సైలెంట్ గా ఉంటే… ఓవైపు పాదయాత్ర, మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారం, ఇంకోవైపు అసంతృప్త నేతలను బుజ్జగించటం… ఇలా రేవంత్ దూకుడుగా వెళ్తున్నారు. ఎవరెన్ని అయినా అనని నా పని నాదే అన్నట్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డి యాక్టింగ్ పీసీసీ చీఫ్ అయిపోయారు… ఇక ఫుల్ టైం పీసీసీ కన్ఫామ్ కావటమే మిగిలిందంటూ గాంధీ భవన్ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.