తెలంగాణ పీసీసీ రేస్ రసవత్తరంగా మారింది. పార్టీని బ్రతికించుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ఇదే చివరి అవకాశం అని విశ్లేషణలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎంపీ రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనుండటం ఆసక్తిరేపుతోంది.
నిజానికి కాంగ్రెస్ అధిష్టాన దూతగా ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ రాష్ట్రానికి వచ్చి అభిప్రాయ సేకరణ చేశారు. ఇందులో కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి పేర్లు బలంగా వినిపించినా… రేవంత్ రెడ్డి వైపే ఎక్కువ మంది నేతలు మొగ్గుచూపారు. దీంతో రేవంత్ అంటే ముందు నుండి వ్యతిరేకతతోనే ఉన్న కొందరు నేతలు నిరసన గళాన్ని వినిపిస్తూ, ప్రత్యేక మీటింగ్ లతో హాడావిడి చేశారు. అవసరం అయితే ఢిల్లీ వెళ్తాం అంటూ ప్రకటించేశారు. దీంతో ఆ నేతల హాడావిడిని బట్టి రేవంత్ కు పీసీసీ ఖాయం అయినట్లేనన్న వాతావరణం ఏర్పడింది.
ఓవైపు ఇదంతా జరుగుతున్న తరుణంలో… రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మద్యాహ్నాం 3గంటలకు జరిగే డిఫెన్స్ పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా ఉండటంతో హజరుకానున్నాడు. అయితే, అదే కమిటీలో రాహుల్ గాంధీ కూడా సభ్యుడిగా ఉన్నారు. దీంతో అక్కడ రాహుల్ ను ప్రత్యేకంగా కలిసే అవకాశం రేవంత్ రెడ్డికి దొరుకుతుందన్న అంచనాలు ఉన్నాయి. అక్కడ మరోసారి రేవంత్ తనకు అవకాశం ఇవ్వాలని కోరే అవకాశం ఉంది.
అయితే, ఇది ఎప్పుడో డిసైడ్ అయిన మీటింగ్ అని… పైగా రేవంత్ రెడ్డికే పీసీసీ అని డిసైడ్ అయినట్లేనని… ఇలాంటి సందర్భంలో ప్రత్యేకంగా తను మళ్లీ కోరేదేమీ ఉండదని రేవంత్ రెడ్డి వర్గం నాయకులు ధీమాగా ఉన్నారు.