గ్రేటర్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి ఎంపీ పరిధిలో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులతో ఎంపీ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు, బీజేపీ-టీఆర్ఎస్ ప్రచార తీరుపై నేతలతో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
మల్కాజ్ గిరి పరిధిలోని డివిజన్లలో తాను ప్రచారం చేశానని, అయితే పోలింగ్ సమయంలో ప్రజల ఆలోచనలో మార్పులు వచ్చాయన్నారు. ఈ ఎన్నికల్లో భావోద్వేగం పనిచేసిందని అన్న రేవంత్, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సంపూర్ణ విశ్వాసం కల్పించాల్సి ఉండే. కానీ మనకు తెలియకుండానే కేసిఆర్ మన మీద దుష్ర్పచారం చేశారు. మనం గెలిచినా టిఆర్ఎస్ లో చేర్చుకుంటాడు అన్న ఇంప్రెషన్ జనాల్లోకి తీసుకెళ్లాడన్నారు.
ఇక బీజేపీ సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయటం కూడా తోడయ్యిందన్నారు. అయితే ఈ ఓటమితో కృంగిపోవాల్సిన అవసరం లేదని, మీకు నేనున్నా… ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. మీకు ఏ ఆపద వచ్చినా మీకష్ట సుఖాల్లో నేను అండగా ఉంటానని, మనకు ఓటేసిన వారికి మనం జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉందని నేతలకు సూచించారు. మనకు పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి జెండా మోయాల్సిన అవసరం ఉందని, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అన్నిరకాలుగా అధికారులపై వత్తిడి తీసుకొచ్చి పనిచేద్దామని పిలుపునిచ్చారు.
ప్రతి శనివారం 10 నుంచి 5 గంటల వరకు నేను ఆఫీసులో అందుబాటులోనే ఉంటానన్న రేవంత్, మన పార్లమెంటు పరిధిలోని సమస్యలపై కలిసి పనిచేద్దామన్నారు. టిఆర్ఎస్ వాళ్ల మాటలు చూస్తుంటే స్పెషల్ ఆఫీసర్ పాలన వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఏడాది రెండేళ్ల వరకు స్పెషల్ ఆఫీసర్ పాలన రావొచ్చు అనిపిస్తున్నదని,
పాలకమండలి కొలువుదీరకపోయినా అధికారుల పాలన ఉన్నా మనం ప్రజల కోసం పనిచేయవచ్చన్నారు.
సమాధులు కూలగొడతం అని ఎంఐఎం, మసీదులు కూలగొడతం అని బిజెపి, వ్యూహాత్మక ఎత్తుగడ వేసి తాత్కాళిక ప్రయోజనం పొందారు. ఇక దేశంలో బిజెపికి ఎదురే లేదు అనుకుంటే పొరపాటే. నిన్ననే ప్రధాని మోదీ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అక్కడ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు ఓడిపోయి సమాజ్ వాదీ పార్టీ గెలిచిందని, మహారాష్ట్రలో 5 ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4 చోట్ల బిజెపి ఓడిపోయిందన్నారు.
ఈ రాష్ట్రంలో కేసిఆర్ పథనం ఎలా మొదలైందో మోదీ పథనం కూడా మొదలైందని రేవంత్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అపర చాణక్యుడు అనుకుంటే వైఎస్ పాదయాత్రతో 2004లో 250 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. 2009 ఎన్నికల్లో అభ్యర్థులు లేక టిఆర్ఎస్ పోటీ చేయలేదు. కానీ 2014లో కేసిఆర్ సర్కారు ఏర్పాటు చేశాడు. 2024 నుంచి 34 వరకు కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన అవకాశం ఉందని, ఎంత గొప్ప నాయకులైనా మూడోసారి అవకాశం రాలేదన్న అంశాన్ని మరవొద్దన్నారు.
ఈరోజు ఉన్న భావోద్వేగం ఇంకో రోజు ఉండదు. తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలిచింది. కేసిఆర్ కు పోటే లేదన్నారు. కానీ దుబ్బాక, జిహెచ్ఎంసిలో ఓడిపోయాడు. నేను కొడంగల్ లో ఓడిపోయినప్పుడు నా పనైపోయిందన్నరు. కానీ మల్కాజ్ గిరిలో మూడు నెలల్లో గెలిచినని గుర్తు చేశారు.