హుజురాబాద్ టీఆర్ఎస్ లీడర్ కౌశిక్ రెడ్డికి ‘గవర్నర్ కోటా ఎమ్మెల్సీ’ వ్యవహారం రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు దారి తీస్తోంది. దాదాపు రెండు వారాల సమయం గడుస్తున్నా తెలంగాణ కేబినెట్ పంపిన ఫైల్‌ను గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తొలుత గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య సత్సంబంధాలు లేకపోవడం ఆలస్యం అవుతోందని ప్రచారం జరిగినా.. అసలు కథ వేరే ఉందన్న చర్చ జరుగుతోంది.
కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వకుండా ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ జరుగుతున్నట్టుగా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అది కూడా స్వయంగా కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన సీఎం కేసీఆరే.. ఇప్పుడు మళ్లీ ఆయనకు ఎమ్మెల్సీ దక్కకుండా ప్రయత్నాలు చేస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కేబినెట్ పంపిన ఆ ఫైల్‌పై సంతకం చేయవద్దని గవర్నర్ తమిళిసైకి కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన కథ, స్క్రీన్‌ప్లేను ఎంపీ సంతోష్ రావు .. ఢిల్లీలో ఉండి నడిపించారని అంటున్నారు. స్వయంగా ప్రధాని మోదీని కలిసి సంతోష్ రావు… ఇందుకు సంబంధించిన విజ్ఞప్తిని చేశారని చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారం కాస్త నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ.. ప్రధానితో సంతోష్ రావు రహస్యంగా భేటీ అయ్యారని ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించడం నిజమేనేమో అన్న వాదనలకు ఇందుకు బలాన్నిస్తోంది.
ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన పేరుతో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కౌశిక్ రెడ్డితో బాగా పనిచేయించుకోవాలని…
ఆతర్వాత కేసులు ఉన్నాయనే కారణంతో చెక్‌పెట్టాన్నది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోందని ఈ పరిణామాలన్నింటిని గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కౌశిక్ రెడ్డిలాంటి వారికే ఎమ్మెల్సీ ఇవ్వడంతో.. పార్టీ మారితే, తమకు మంచి పదవులు దక్కొచ్చన్న ఆశను ఇతర పార్టీ నేతల్లో కలిగించొచ్చు అన్నది కేసీఆర్ స్ట్రాటజీ అని వారు అంచనా వేస్తున్నారు. కౌశిక్ రెడ్డి.. ఏదో తేడా కొడుతోందని చూసుకోమని సలహా ఇస్తున్నారు.