తెలంగాణ రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నాడా? అంటూ సీరియస్ అయ్యారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నార్సింగ్ శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ స్టూడెంట్ సాత్విక్ సూసైడ్ ఘటనపై ఆయన గురువారం రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి వెంకట్ రెడ్డి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
విద్యార్థి మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు వెంకటరెడ్డి స్వయంగా శ్రీ చైతన్య కాలేజీకి వెళ్లారు. అయితే వెంకట్ రెడ్డి కాలేజీ లోపలికి వెళ్లకుండా సిబ్బంది అడ్డుకోవడంపై మండిపడ్డారు. అనంతరం కాలేజీ ఆవరణలో దీక్ష చేపట్టారు. కాలేజీ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.
సాత్విక్ సూసైడ్ నోటులో పేర్కొన్న నలుగురిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన నలుగుర్ని అరెస్ట్ చేసే వరకు దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. సమాచారం అందుకున్న ఏసీపీ రమణగౌడ్ చైతన్య కాలేజ్ వద్దకు చేరుకుని కోమటిరెడ్డి వెంకటరెడ్డితో చర్చలు జరిపారు. ఆందోళన చేయవద్దని, సాత్విక్ సూసైడ్ పై విచారణ జరుగుతోందని చెప్పారు.
అనంతరం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. నారాయణ, చైతన్య కాలేజీ యాజమాన్యాలకు పోలీసులు అమ్ముడుపోయారని వ్యాఖ్యానించారు. నారాయణ, చైతన్య కాలేజీలపై ఏపీ ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతున్న విషయాన్ని ప్రస్తావించారు. చిత్తూరులో టెన్త్ క్లాస్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అసలు తెలంగాణలో హోంమంత్రి ఉన్నాడా? అని ప్రశ్నించారు.
విద్యార్థులను ఇష్టారీతిలో కొట్టిన కాలేజీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని.. వెంటనే వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ల ఒత్తిడి వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నట్టు తోటి స్టూడెంట్స్ చెబుతున్నారని, ఇలాంటి ఘటన మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఎంపీ వెంకట్ రెడ్డి.