సికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాను కలిశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక ఎంపీలు. రైల్వేల విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. పలు సూచనలు, డిమాండ్లు చేశారు.
ఏడేళ్లు గడుస్తున్నా తెలంగాణకు కేంద్రం ఇచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇప్పటికీ మంజూరు కాకపోవడం గురించి మాట్లాడారు రాష్ట్ర ఎంపీలు. అలాగే శంషాబాద్ ఎంఎంటీఎస్ రైల్ ప్రాజెక్ట్, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బుల్లెట్ రైల్ ఏర్పాటు, అహ్మదాబాద్-ముంబై బులెట్ రైలు మొదలైన అంశాలపై చర్చలు జరిపారు. రెండేళ్లకు ఒకసారి కాకుండీ ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఇటువంటి సమావేశం ఏర్పాటు చేయాలని సూచించినట్లు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు.
గజానన్ మాల్యా మాట్లాడుతూ.. కరోనా కారణంగా సమావేశాలు ఏర్పాటు చేయలేకపోయామని తెలిపారు. రైళ్ల రాకపోకలు లేకపోయినా.. అభివృద్ధి కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించినట్లు చెప్పారు. ప్రస్తుతానికి కరోనా కారణంగా ఆగిపోయిన 85శాతం సేవలను పునరుద్ధరించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో కొన్ని ప్రాజెక్టుల పనులు ఆలస్యంగా సాగుతున్నాయని స్పష్టం చేశారు. తామే సొంతంగా పూర్తి నిధులతో మరికొన్నింటిని కడుతున్నామని వివరించారు గజానన్ మాల్యా.