వృద్ధులపై టీఆర్ఎస్ ఎంపీటీసీ హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో వృద్ధులు తీవ్రంగా గాయపడటంతో వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం పరిధిలోని పులుమామిడి గ్రామంలో పోలం వద్ద ఒంటరిగా ఉన్న వృద్ధులపై ఆ గ్రామ ఎంపీటీసీ భర్త అరాచకం సృష్టించాడు.
ఒంటరిగా ఉన్న వృద్ధులు అని చూడకుండా దాడి చేసి విచక్షణారహితంగా కొట్టాడు. దాడికి గురైన వృద్ధులను స్థానికులు వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆ గ్రామ ఎంపీటీసీ అరాచకాలు అన్నీ ఇన్నీ కావని.. గ్రామస్తులు వాపోతున్నారు. గతంలో కూడా గ్రామంలో పలువురిపై ధాడి చేయడమే కాకుండా బయట పార్కింగ్ చేసి ఉన్న వాహనాలపై బండరాళ్లు వేసి విధ్వంసం చేసిన సంఘటనలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
ఈ విషయంలో స్థానిక ఎస్ఐ సహకారం కూడా ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎవరిని పడితే వారిపై విచక్షణ రహితంగా మానవత్వం లేకుండా దాడి చేస్తున్నాడని.. గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. తిరిగి కంప్లైట్ ఇచ్చిన వ్యక్తి పైన కేసు పెట్టి, జైలుకు పంపుతున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
పోలీసులు కూడా ఎంపీటీసీ భర్త రామకృష్ణా రెడ్డికే మద్దతు ఇస్తున్నారని, అందుకే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా సదరు వ్యక్తిపై చర్యలు తీసుకుంటారా లేదా ముసలి వాళ్ళ పైన చేసిన దాడి కనిపిస్తుందా? అని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఎంపీటీసీ భర్త రామకృష్ణా రెడ్డి శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఇలా చర్యలు తీసుకోక పోవడం.. ఈ వాదనలకు బలం చేకూరుస్తుంది.