రాష్ట్రంలో ఎమ్మార్వో హత్య ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అప్పటికే రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో… సీఎం కేసీఆర్ ఉద్యోగ వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారన్న ముద్ర పడటం మొదలైంది. ఉద్యోగ సంఘాల నేతలను పక్కనపెట్టడం, ఎన్నికలు ముందు వేసిన పీఆర్సీ ఇప్పటి వరకు ఎటూ తేల్చక పోవటం లాంటి అంశాలతో టీఆర్ఎస్‌పై ఉద్యోగులంతా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.
అందుకే సీఎం కేసీఆర్ హుజూర్‌నగర్ ఎన్నిక ముందు ఉద్యోగ సంఘాను పిలుచుకొని డ్యామెజ్ కంట్రోల్ మొదలుపెట్టారు. హుజూర్ నగర్ ఎన్నిక అవ్వగానే మళ్లీ కలుద్దాం అని చెప్పిన సీఎం కేసీఆర్… ఇప్పటి వరకు కలవనే లేదు. ఇంతలోనే ఎమ్మార్వో విజయారెడ్డి హత్య జరగటంతో ప్రభుత్వంపై మళ్లీ తీవ్ర వ్యతిరేకత రావటం, ఉద్యోగ సంఘాలు కూడా సీఎం కేసీఆర్‌పై నేరుగా విమర్శలు చేస్తూ వచ్చారు.
అయితే, రెవెన్యూ సంఘాల్లో ఉన్న సీఎం కేసీఆర్ అనుకూల వర్గం కనీసం మా బదిలీలు అయినా చెపట్టండి, ఇష్యూ డైవర్ట్ కావటంతో పాటు… మా వాళ్లు కొంతైనా శాంతిస్తారు అని వేడుకున్నారు. ఇటు కేటీఆర్‌ను కలిసి మా బదిలీలు చేపట్టండి… అని వేడుకోవటంతో యువరాజు రెండు మూడు రోజుల్లో మీరు శుభవార్త వింటారు అని ప్రకటించారు.
అందుకే దాదాపు ఏడాదిగా ఉన్న సొంత జిల్లాలకే ఎమ్మార్వో ట్రాన్స్‌ఫర్ అంశంపై తెలంగాణ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఎన్నికల ముందున్న స్థానాలకే మళ్లీ బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మొత్తం 378 ఎమ్మార్వోలను ఏకకాలంలో బదిలీ చేసింది ప్రభుత్వం. కనీసం ఇలాగైనా తమపై ఉన్న వ్యతిరేకతను కొంతైనా తగ్గించుకోవాలన్న ఆశతో ప్రభుత్వం ఇలా చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.