రాజ్యాంగం మార్చాలన్న కేసీఆర్ మాటల్లో అంబేద్కర్ పేరును కనుమరుగు చేసే కుట్ర దాగుందని ఆరోపించారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో లక్డీకపూల్ సెంట్రల్ కోర్ట్ హోటల్లో మీడియా సమావేశం జరిగింది. దేశంలో సామాజిక న్యాయాన్ని హరించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లుగా ఉందని అన్నారు.
కేసీఆర్ అహంకారంగా, అవగహనా రాహిత్యంగా మాట్లాడుతారని మండిపడ్డారు మందకృష్ణ. ప్రశ్నించే మీడియాపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని.. మీడియా సోదరులను బెదిరిస్తే ఒక్క జర్నలిస్ట్ సంఘం మాట్లాడకపోవడం బాధాకరని అన్నారు. కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడినా అవే నిజాలుగా రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్.. రాజ్యాంగంలో ఉండే ప్రవేశిక కుడా చదవలేదని విమర్శించారు.
సీఎంకు రిజర్వేషన్లపై కనీస అవగాహన లేదన్నారు మదకృష్ణ. కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలు, ఎస్టీలు లేరని.. అక్కడ రిజర్వేషన్లు ఉండవని చెప్పారు. ఈ అవగాహన కూడా కేసీఆర్ కు లేదు. ఎన్టీఆర్ హయాంలో ఎస్సీలకు 14 నుండి 15.. ఎస్టీలకు 4 నుండి 6 శాతం చేశారు.. అప్పుడు కేసీఆర్ టీడీపీలోనే ఉన్నారని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఎస్సీలకు జనాభా ప్రకారమే రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని.. కేసీఆర్ లెక్కల ప్రకారం 19 శాతం ఉన్నప్పుడు ఇక్కడ రిజర్వేషన్లు కల్పించాల్సింది పోయి.. రాజ్యంగం మార్చాలని ఎలా చెప్తారని ప్రశ్నించారు.
40 ఏళ్ల రాజకీయ అనుభవంలో కేసీఆర్ తెలుసుకున్నదేంటని నిలదీశారు మందకృష్ణ. కేసీఆర్ హయాంలో స్థానిక సంస్థల్లో ఉన్న రిజర్వేషన్లు సగానికి సగం తగ్గించారని గుర్తు చేశారు. పార్లమెంట్ లో పెండింగ్ లో మహిళల రిజర్వేషన్ల గురించి ఎందుకు చొరవ తీసుకోవడం లేదన్నారు. కేసీఆర్ మహిళల గురించి మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించడమేనని అభివర్ణించారు. నియంతృత్వ పాలన కోసమే రాజ్యాంగం మార్చాలని అంటున్నారని.. అది జరగదని.. కేసీఆర్ తో యుద్ధానికి అన్ని సంఘాలను కలుపుకుని ఒకే వేదికగా ముందుకెళ్తున్నామని తెలిపారు.
కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు
20న అన్ని మహిళా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం
21న అన్ని విద్యార్థి సంఘాలతో సమావేశం
22న దివ్యాంగులతో సమావేశం
23న మేధావుల సమావేశం
24న బీసీ సంఘాల సదస్సు
25న ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో మీటింగ్
26న మైమార్టీ సంఘాల సదస్సు
27న రాష్ట్రస్థాయి మహాసభ (వరంగల్)
119 నియోజకవర్గాల్లో యుద్ధ భేరి సన్నాయక సమావేశాలు నిర్వహిస్తున్నామని వివరించారు మందకృష్ణ మాదిగ. కేసీఆర్ ప్రజాస్వామ్యం లేని చైనాను ఆదర్శంగా తీసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాజ్యాంగం కొన్ని కులాలకే పరిమితం కాదని.. దేశంలో అందరి కోసం రాసిందని తెలిపారు. కేసీఆర్ ను ఇలాగే వదిలేస్తే రానున్న రోజుల్లో ఇలాంటి వ్యతిరేకులు మరింత రెచ్చి పోతారని అన్నారు. పార్టీలకు అతీతంగా తమ పోరాటంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు రాజ్యాంగ బద్దంగా ఉన్న అన్ని కమిషన్లను కలిసి.. కేసీఆర్ తీరును వివరిస్తామని తెలిపారు మందకృష్ణ.