దేశంలోని అన్నదాతలకు వరప్రదాయినిగా భావిస్తున్న ఓ ఆధునిక డ్రోన్ ని క్రికెట్ స్టార్ ఎం.ఎస్. ధోనీ సోమవారం చెన్నైలో లాంచ్ చేశాడు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన దీన్ని ‘ద్రోణి’ అనే పేరిట వ్యవహరిస్తున్నారు. గరుడ ఏరోస్పేస్ కంపెనీ తయారు చేసిన ఈ డ్రోన్ విశిష్టతలెన్నో ఉన్నాయి. వ్యవసాయ రంగానికి ఇది చాలా ఉపయోగపడుతుందట. ముఖ్యంగా పొలాల్లో క్రిమి సంహారక మందులను చల్లడంలో దీనికిదే సాటి అని ఈ సంస్థ సీఈఓ అగ్నీశ్వర్ జయప్రకాష్ తెలిపారు.
మరో రెండు నెలల్లో ఈ డ్రోన్ మార్కెట్లో అందుబాటులోకివస్తుందని ఆయన చెప్పారు. ఈ కంపెనీకి ధోనీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. బ్యాటరీతో నడిచే ‘ద్రోణి’ డ్రోన్ రోజుకు 30 ఎకరాల్లో క్రిమి సంహారక మందులను చల్లగలదని జయప్రకాష్ చెప్పారు.
పైగా నిఘాకోసం.. అంటే సర్వేలెన్స్ ప్రయోజనాలకూ దీన్ని వాడవచ్చునన్నారు. మేకిన్ ఇండియా.. ఆత్మనిర్భర్ అన్న నినాద స్ఫూర్తితో ఈ డ్రోన్ ని తయారు చేసినట్టు వివరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ధోనీ.. లోగడ కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సమయాల్లో వ్యవసాయం పట్ల తానెంతో ఆసక్తి చూపానని తెలిపాడు. రైతులకు ఇలాంటి డ్రోన్లు ఎంతో ఉపయోగపడతాయని అన్నాడు. తన ‘ఈజ’ అనే వ్యవసాయ క్షేత్రాన్ని గత మార్చిలో ఓపెన్ చేశానని, మూడు రోజులపాటు ప్రజలు దీన్ని విజిట్ చేశారని చెప్పాడు. రాంచీలో 43 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ వ్యవసాయ క్షేత్రంలో స్ట్రా బెర్రీ, డ్రాగన్ ఫ్రూట్, ఇంకా అనేక రకాల పండ్లు, కూరగాయలు పండుతాయని ధోనీ వెల్లడించాడు. అన్నదాతలకు ఉపయోగ పడే ఈ ‘ద్రోణి’ డ్రోన్ ని అభివృద్ధి పరిచినందుకు ఆయన ఈ సంస్థను అభినందించాడు.