ఉప ఎన్నిక అవ్వగానే దళిత బంధును కాకి ఎత్తుకుపోయిందని.. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ సెటైర్లు వేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఢిల్లీలో మాదిగ విద్యార్థి జాతీయ మహా సభలో ఆయన ప్రసంగించారు. వర్గీకరణపై కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. దళిత ముఖ్యమంత్రి లేదు.. మూడు ఏకరాల భూమి ఇవ్వలేదంటూ కేసీఆర్ పై మండిపడ్డారు.
కేసీఆర్ కు, ఆయన కుటుంబానికి పదవులు రావటానికి కారణం దళితులేనని అన్నారు రేవంత్. కానీ వారి డిమాండ్ ను మాత్రం సీఎం పట్టించుకోవడం లేదని విమర్శించారు. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి ఎందుకు రాలేదని నిలదీశారు. ఎవరైనా వస్తే.. కడియం శ్రీహరి, రాజయ్య లాగా తమ పరిస్థితి అవుతుందేమోనని కొందరు తనతో చెప్పినట్లుగా తెలిపారు రేవంత్. పంజాబ్ లో హామీ ఇవ్వకపోయినా దళితుడిని ముఖ్యమంత్రి చేశామని గుర్తు చేశారు. దేశంలో ఏకైక దళిత ముఖ్యమంత్రిని చేసిన ఘనత రాహుల్ గాంధీకే దక్కుతుందని చెప్పుకొచ్చారు.
సోనియా, రాహుల్ గాంధీ అనుమతితోనే తాను ఈ సమావేశానికి వచ్చానన్నారు రేవంత్. వాళ్ళతో అన్నీ మాట్లాడి.. వారి ప్రతినిధిగానే వచ్చినట్లు తెలిపారు. మాదిగ సామాజికవర్గం మొత్తం తన వెనుక ఉంది కాబట్టే ఎంపీని అయ్యానన్న ఆయన.. తాను అత్యున్నత స్థానానికి ఎదగటానికి, తన కుటుంబ కోసం ఎంత చిత్తశుద్ధితో పని చేస్తానో ఏబీసీడీ వర్గీకరణ కోసం కూడా అలాగే పని చేస్తానని చెప్పారు. ప్రభుత్వం మీద అందరం కలిసి ఒత్తిడి తీసుకొద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ బిల్లు లాగా వర్గీకరణ బిల్లు తెస్తుందని.. లక్ష్యం నెరవేరే వరకు మందకృష్ణ మాదిగతో ఉంటానని అన్నారు రేవంత్ రెడ్డి.