ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగియనుంది. 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి గత నెల 29న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయగా.. మంగళవారం నోటిఫికేషన్ ఇచ్చింది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఈ నెల 19 వరకు నామినేషన్ పత్రాలను స్వీకరించనున్నారు అధికారులు. ఈ సమయంలో కేంద్రమంత్రి పదవికి అబ్బాస్ నఖ్వీ రాజీనామా చేయడంతో అనేక వార్తలు తెరపైకి వస్తున్నాయి.

నఖ్వీ ఉప రాష్ట్రపతి రేసులో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నఖ్వీని పోటీ చేయించనున్నట్లు చర్చ జరుగుతోంది. అందుకే ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినట్లుగా చెబుతున్నారు. పైగా మోడీతోపాటు నడ్డాతోనూ భేటీ అయ్యారు నఖ్వీ. ఆ తర్వాతే ఆయన రాజీనామా చేశారు.
ఈ నెల 20న ఉపరాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు 22న గడువు ఇచ్చారు. ఆగస్టు 6న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్.. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. కొత్తగా ఎన్నికైన ఉప రాష్ట్రపతి ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేస్తారు. 233 మంది రాజ్యసభ సభ్యులతోపాటు 12 మంది నామినేటెడ్ సభ్యులు, 543 మంది లోక్ సభ ఎంపీలతో కలుపుకుని మొత్తం 788 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.