రెండు తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఎంతో ఘనంగా సాగుతున్నాయి. భద్రాచలంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు గత పది రోజులుగా స్వామివారి కోవెలలో ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ అధ్యయనోత్సవాల్లో భాగంగా నేడు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది వేలాది సంఖ్యలో వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు అన్ని సౌకర్యాలను సిద్ధం చేశారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ఉత్తర ద్వారం నుండి రాములవారు సాక్షాత్తు వైకుంఠ రాముడుగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉత్తర ద్వారం తెరిచినప్పటి నుంచి భక్తుల జయ జయ ధ్వనులు చేస్తూ స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణం అంతా స్వామి వారి నామాలతో మారుమ్రోగుతుంది.
తెల్లవారుజామున నాలుగు గంటల నుండే ఉత్తరద్వారం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన గ్యాలరీలలోకి పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు. వేద పండితుల ప్రవచనాలు, అర్చకుల వేద మంత్రాల మధ్య ఉదయం ఐదు గంటల సమయంలో జే గంటలు మోగుతుండగా ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి. సాంబ్రాణి పొగలు, హారతుల మధ్య గరుడ వాహనం పై రామచంద్ర ప్రభువు దర్శనమివ్వగా, గజ వాహనం పై సీతమ్మ వారు కొలువుదీరారు.
సీతాసమేత స్వామివారిని దర్శించుకున్న భక్తుల ఆనందానికి అవధులు లేవు. జై శ్రీరామ్..జై శ్రీరామ్ అంటూ భక్తులు స్వామివారిని కొలుస్తూ ఆధ్యంతం మంత్రముగ్ధులైపోయారు. వేదమంత్రోత్సరణల నడుమ స్వామివారు ఆరు గంటల వరకు సుమారు గంట పాటు భక్తులకు దర్శనమిచ్చి అనంతరం స్వామివారు గరుడ వాహనంపై తిరువీధి సేవకు బయలుదేరి వెళ్లారు.అప్పటివరకు స్వామివారిని దర్శించుకున్న భక్తులు వైకుంఠ ద్వారం గుండా ఆలయంలోనికి ప్రవేశించి స్వామివారి మూలవిరాట్యును దర్శించుకుంటున్నారు.