నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో మూలా నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు కాళరాత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేదపండితులు అష్టోత్తరనామార్చన నిర్వహించారు. మూలా నక్షత్రం సందర్భంగా బాసర ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.
ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుంచే క్యూలైన్లు రద్దీగా కనిపించాయి. ఆ తర్వాత అంతకంతకూ భక్తుల రద్దీ కనిపించింది. దీంతో ఆలయ అధికారులు, పోలీసులు ఆంక్షలు విధించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.
మరోవైపు వీఐపీల తాకిడి ఎక్కువవడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండడంతో ఓ షుగర్ పేషంట్, యువతి స్పృహ తప్పి పడిపోయారు. అక్కడ కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించకపోవడంపై భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వీఐపీ, పోలీసు కుటుంబాల సేవలో ఆలయ సిబ్బంది తరించారని.. పార్కింగ్ దూర ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో వృద్దులు, చిన్నపిల్లల తల్లుల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సరస్వతి సన్నిధానంలో అక్షరాభ్యాస కార్యక్రమం ప్రారంభమవడంతో మండపాల్లో రద్దీ నెలకొంది. ఆనవాయితీ ప్రకారం మూలానక్షత్రం రోజున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.