సోమవారం కన్ను మూసిన 82 ఏళ్ళ సమాజ్ వాదీ పార్టీ అగ్రనేత, ప్రముఖ రాజకీయ దురంధరుడు ములాయం సింగ్ యాదవ్ తమ కుటుంబానికి, వారసులకు వదలి వెళ్లిన స్థిర, చరాస్తుల విలువ కోట్లలోనే ఉంది. అసోసియేషన్ ఆఫ్ డెమాక్రాటిక్ రిఫామ్స్ నివేదిక ప్రకారం 2019 నాటికే ఆయన ఆస్తుల విలువ 20 కోట్లకు పైగా ఉందట. అప్పటికే ఆయనకు 20 కోట్ల 56 లక్షలకు పైగా ఆస్తులు, 2 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని ఈ రిపోర్టు తెలిపింది.
2017-18 నాటికి ఆయన ఆదాయం 32 లక్షలకు పైగా ఉందని, ఆయన వద్ద 16 లక్షల 75 వేలకుపైగా క్యాష్ ఉంటూ వచ్చిందని, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో 40 లక్షలకు పైగా విలువైన డిపాజిట్లు ఉండేవని ఈ నివేదిక వెల్లడించింది. ఇవి గాక తొమ్మిది లక్షలకు పైగా ఎల్ఐసీ, ఇతర బీమా పాలసీలు ఉండేవట.
ఆయన వద్ద 17 లక్షల 16 వేల రూపాయల ఖరీదైన టయోటా కారు, 17 లక్షల 67 వేల ఖరీదైన ఎలిమినేటర్ వెహికల్ కూడా ఉన్నట్టు ఈ రిపోర్టు పేర్కొంది. ఇక గోల్డ్, జువెల్లరీ విషయానికి వస్తే తనకు 2 కోట్లకు పైగా విలువైన 7.50 కేజీల గోల్డ్ ఉందని ములాయం సింగ్ యాదవ్ అప్పటి తన అఫిడవిట్ లో పేర్కొన్నారు.
ఇంకా ఎటావా జిల్లాలోనూ, మరికొన్ని చోట్ల సుమారు 8 కోట్ల విలువైన వ్యవసాయ భూములు, కోటి రూపాయలకు పైగా విలువైన వ్యవసాయేతర భూములు ఉన్నాయని, యూపీలో తన నివాస భవనం 6 కోట్లకు పైగా ఖరీదు చేస్తుందని ఆయన పేర్కొన్నారని ఈ నివేదిక వివరించింది. అయితే తన కుమారుడు అఖిలేష్ యాదవ్ నుంచి తాను 2 కోట్ల 13 లక్షలకు పైగా అప్పు తీసుకున్నానని తన అఫిడవిట్ లో తెలిపారట. ఇవన్నీ 2019 నాటి లెక్కల తాలూకు వివరాలు. ఇప్పటి ఆస్తుల విలువతో పోలిస్తే కళ్ళుతిరగడం ఖాయమంటున్నారు.