సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఇటీవల ఆయన అనారోగ్య పరిస్థితుల కారణంగా గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్ లో చేరారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం ఈ రోజు మరింత క్షీణించింది.
దీంతో ఆయన్ని ఐసీయూ వార్డుకు తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకలిగిస్తోందని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ వైద్యులు సుషీలా కటారియా ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.
తండ్రి ములాయం సింగ్ ఆరోగ్య పరిస్థితిపై అఖిలేష్ యాదవ్‌కు సమాచారం అందింది. దీంతో ఆయన హుటాహుటిన ఆసుపత్రికి బయల్దేరి వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వయస్సు 82 ఏండ్లు. యూపీకి మూడు సార్లు సీఎంగా పనిచేశారు.
కేంద్ర రక్షణ శాఖా మంత్రిగా గతంలో ఆయన సేవలందించారు. గతంలో ఆయన కరోనా బారిన పడ్డారు. దీంతో అప్పటి నుంచి అనారోగ్య సమస్యలను ఆయన ఎదుర్కొంటున్నారు. రెండో భార్య మరణం కూడా ఆయనను తీవ్రంగా కుంగదీసింది. అనారోగ్యం కారణంగా ములాయం కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగానే ఉన్నారు.