ప్రస్తుతం హైదరాబాద్ లో ఎటువైపు చూసినా మల్టీప్లెక్సులు దర్శనమిస్తున్నాయి. నగరానికి నలువైపులా ఇవి ఉన్నాయి. మరికొన్ని కొత్తవి కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే.. భాగ్యనగరం అభివృద్ధి చెందుతున్న వేగంగా, మల్టీప్లెక్స్ సంస్కృతి మాత్రం విస్తరించడం లేదు. ఇది స్వయంగా అధికారులు చెబుతున్న మాట.
మహానగరంలో మల్టీప్లెక్స్ నిర్మాణం మందగించింది. 2021 నుంచి ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తవాటి కోసం కేవలం 4 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. 2020లోనైతే కేవలం ఒకే దరఖాస్తు వచ్చింది. 2016 నుంచి 2019 వరకు ఏటా సగటున 5 నుంచి 8 వరకు దరఖాస్తులు వచ్చేవి. కానీ, మూడేళ్లుగా తగ్గుదల కనిపిస్తోందని చెబుతున్నారు బల్దియా అధికారులు.
కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జనాలు థియేటర్లకు రావడం మానేశారు. ఆ తర్వాత ఎగ్జిబిటర్లు టికెట్ రేట్లు తగ్గించారు. ఆక్యుపెన్సీ పెరిగినప్పటికీ, చిన్న సినిమా కోసం థియేటర్లకు ప్రేక్షకులు రావడం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో మల్టీప్లెక్సుల్లో పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు మాత్రమే సందడి కనిపిస్తోంది. మిగతా రోజుల్లో ఆక్యుపెన్సీ లేక వెలవెలబోతున్నాయి. మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోతున్నాయి.
కరోనా టైమ్ లో చాలా మల్టీప్లెక్సు కాంప్లెక్సుల్లో షాపింగ్ మాల్స్ ఖాళీ చేశారు. శివార్లలోని చాలా బిల్డింగుల్లో ఇప్పటికీ షాపులు ఖాళీగానే ఉన్నాయి. మల్టీప్లెక్సులు బాగా నడిస్తేనే షాపులు బాగుంటాయి. షాపులు బాగా నడిస్తేనే మల్టీప్లెక్సులు కూడా నడుస్తాయి. ఏ ఒక్కటి తగ్గినా, మరో విభాగం నష్టపోయినట్టే. ప్రస్తుతం మార్కెట్లో అదే జరుగుతోంది.