రాష్ట్రంలో అభివృద్ధిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. హన్మకొండలోని 6వ డివిజన్ లో ‘హాథ్ సే హాథ్’ జోడో యాత్రలో భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి లష్కర్ బజార్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పాదయాత్ర ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ సందేశాన్ని ఇంటింటికి తిరుగుతూ కరపత్రాల రూపంలో ప్రచారం చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతిలో ఎన్ని సమస్యలు పరిష్కరించారో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు జరిగిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసుగు చెందారన్నారు. ఖాళీ స్థలం కంటికి కనిపిస్తే కబ్జా చేయడం, ఎదురు తిరిగితే దాడులు చేయడం, లేదంటే బెదిరించడం అధికార పార్టీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్యగా మారిందని ఆరోపించారు సీతక్క.
కమ్మరి వాడ, మార్కెట్ సెంటర్ వెంకటేశ్వర మెడికల్ షాప్, పద్మశాలి వాడ, బొక్కల గడ్డ, ఈద్గా మీదుగా సాగి సిక్కువాడ-కిషన్ పుర వద్ద పాదయాత్ర ముగిసింది. ఈ పాదయాత్రలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.