మెక్సికోలోని ఓ జిమ్ లో జరిగిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుమార్తెతో కలిసి జిమ్ కు వచ్చిన మహిళ.. 180 కిలోల బార్ బెల్ ను పైకి ఎత్తేందుకు ప్రయత్నించింది. కాస్త పైకి ఎత్తిన వెంటనే అనుకోకుండా అది ఆమె మెడపై పడింది.
ట్రైనర్ వెంటనే బార్ బెల్ ను ఆమెపై నుంచి తీసేందుకు ప్రయత్నించాడు. చుట్టూ ఉన్నవాళ్లు కూడా సాయం చేశారు. అయితే.. అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. ఆ మహిళ చనిపోయింది.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. మెక్సికో సిటీలోని జిమ్ ఫిట్ నెస్ స్పోర్ట్ జిమ్ లో ఇది జరిగింది. మృతురాలి వయసు 35 నుంచి 40 మధ్య ఉంటుందని తెలిపారు అధికారులు.
బార్ బెల్ బరువు ఒక్కసారిగా వెనుక నుంచి మెడపై పడడంతో ఆమె మరణించింది. కళ్లముందే తల్లి చనిపోయడంతో కుమార్తె షాక్ కు గురైంది. ఏం చేయాలో తెలియక బోరున ఏడ్చేస్తూ కనిపించింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.