26/11 ముంబై ఉగ్రదాడికి సూత్రధారి, పాకిస్థాన్ కు చెందిన లష్కరే-తొయిబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు, జమాతుద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ కు ఆ దేశ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అతనిపై పాకిస్థాన్ లో 23 కేసులున్నాయి.
2008 నవంబర్ 26న 10 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులు అత్యంత ఆధునిక ఆయుధాలు, బాంబులతో ముంబై నగరంలోకి ప్రవేశించి కనిపించిన వారి పైనా విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పోలీసు అధికారితో సహా 166 మంది వారి తుపాకీ గుళ్లకు బలయ్యారు. ఆ తర్వాత ఆ తొమ్మిది మంది ఉగ్రవాదులను పోలీసులు కాల్చి చంపారు. పోలీసులకు పట్టుబడిన కసబ్ అనే ఉగ్రవాదికి కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ ఉగ్రదాడికి వ్యూహాకర్త, ప్రధాన నిందితుడు పాకిస్థాన్ కు చెందిన హఫీజ్ సయీద్. అతనిపై ఇండియాలో పలు కేసులు నమోదయ్యాయి. అతడిని తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం పలు మార్లు పాకిస్థాన్ ప్రభుత్వాన్ని అభ్యర్ధించింది. అయినా అతడిని ఇండియాకు అప్పగించలేదు. పైగా ఆ కరుడుగట్టిన ఉగ్రవాది పాకిస్థాన్ లో స్వేచ్ఛగా తిరుగుతూ భారత్ వ్యతిరేక ర్యాలీలలో పాల్గొంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేవాడు.
హఫీజ్ సయీద్ పట్ల పాకిస్థాన్ అనుసరిస్తున్న వైఖరిపై భారత ప్రభుత్వం అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచడంతో అతడిపై పలు కేసులు నమోదు చేసింది. టెర్రర్ ఫైనాన్సింగ్, మనీ లాండరింగ్ తో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఆ దేశ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది.