గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి మహారాష్ట్రలో ముంబై సెంట్రల్ వరకు నడిచే ‘వందే భారత్’ ఎక్స్ ప్రెస్ రైలు గురువారం కొన్ని గేదెలను ఢీకొంది. బాట్వా-మానీనగర్ స్టేషన్ల మధ్య ఉదయం 11. 15 గంటల ప్రాంతంలో కొన్ని గేదెలు ట్రెయిన్ కి అడ్డంగా వచ్చాయి. ఈ ఘటనలో రైలు ఇంజన్ ముందు భాగం స్వల్పంగా దెబ్బ తిన్నదని, రైల్వే సిబ్బంది వెంటనే మరమ్మతు చేశారని తెలిసింది. అనంతరం రైలు సకాలంలో ముంబై సెంట్రల్ కు బయల్దేరినట్టు వెల్లడైంది.
ఈ ఘటనలో కొన్ని గేదెలు మరణించాయని.. వాటి కళేబరాలను తొలగించిన అనంతరం రైలు బయల్దేరిందని ఓ అధికారి చెప్పారు. ఫైబర్ తో ఇంజన్ ముందుభాగం తయారైన కారణంగా పెద్ద నష్టం వాటిల్లలేదన్నారు. . ట్రాక్ సమీపంలో పశువులను వదలరాదని దగ్గరలోని గ్రామస్థులకు నచ్చజెప్పడానికి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
ఈ నెల 5 నుంచి దీని ప్రయాణ సమయాన్ని వెస్టర్న్ రైల్వే అధికారులు మరింత తగ్గించారు. ఆ మేరకు గాంధీనగర్ నుంచి రైలు అనుకున్న సమయానికన్నా 20 నిముషాలు ముందుగా ముంబై సెంట్రల్ చేరుకుంటుంది.
అప్ గ్రేడ్ చేసిన ఈ రైలును ప్రధాని మోడీ గత నెల 30 న ప్రారంభించారు. సురక్షిత ప్రయాణానికి అనువుగా వందే భారత్ రైలును అభివృద్ధి పరిచామని, ఇందులో టికెట్ల ధరలు అంతర్జాతీయ ధరలతో పోలిస్తే సగం కన్నా తక్కువేనని రైల్వే వర్గాలు తెలిపాయి. ఇందులోని సౌకర్యాలు వాల్డ్ క్లాస్ స్థాయిలో ఉంటాయని పేర్కొన్నాయి.