అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ గొప్పదంటూరు. అమ్మ ప్రేమ అలాంటిది మరి. ఏడాది క్రితం అమ్మ నుంచి వెరైంది ఓ చిన్నారి చిరుత పిల్ల. మళ్లీ ఇప్పుడు తన తల్లి వద్దకు చేరుకుంది. ఈ ఘటన ముంబై సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ లో జరిగింది. వీటి కలయిక పలువురి ప్రశంసలు అందుకుంటోంది.
వివరాల్లోకి వెళ్తే.. మానవులపై చిరుత దాడి నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు సీ33-డెల్టా అనే ఆడ చిరుతను పట్టుకున్నారు. డెల్టా చిరుతను పట్టుకున్నప్పటకీ దాడులు తీవ్రమయ్యాయి. అయితే ఇది దీని పని కాదని గ్రహించిన అటవీ శాఖ సిబ్బంది దాన్ని తిరిగి అడవిలో విడిచిపెట్టారు. ఓ కంట కనిపెట్టేందుకు దాని మెడకు రేడియో కాలర్ సైతం కట్టారు. సీ32 అనే మరో ఆడ చిరుత అధికారులకు చిక్కాక ఈ దాడులు ఆగిపోయాయి. ఇదంతా జరిగి ఏడాదయ్యింది.
అయితే సరిగ్గా ఏడాది తర్వాత అక్టోబర్ 10న సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ వద్ద కుక్కలు అరుస్తున్న శబ్దాన్ని విన్న భద్రాతా సిబ్బంది.. అరుపులు వినిపించే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఓ చిరుత పిల్ల దాక్కుని ఉన్నట్లు గుర్తించారు. వెంటనే దాన్ని పట్టుకుని అధికారులకు అప్పజెప్పారు. అటవీ శాఖ అధికారులు ఆ చిరత పిల్లలను వైద్య పరీక్షలు నిర్వహించి, అక్టోబర్ 11న చిరుత పిల్లను తల్లి వద్దకు చేర్చేందుకు సిద్ధమయ్యారు.
చిరుత పిల్లను బోనులో ఉంచి దాని తలుపు హ్యాండిల్ కు ఓ తాడు కట్టారు. అది ఎవరైనా లాగితే తెలుసుకోవచ్చని అనుకున్నారు. కానీ ఆరోజు రాత్రి ఏం జరగలేదు. మరుసటి రోజు చిరుత పిల్ల దగ్గర బోను దగ్గర ఓ కెమెరా ట్రాప్ ను ఏర్పాటు చేసి, దాన్ని ఓ కంట కనిపెట్టారు. తెల్లవారు జామున ఉదయం 4.45 గంటల ప్రాంతంలో బోను వద్దకు ఓ చిరుత రావడాన్ని గమనించారు సిబ్బంది. ఆ చిరుత పులి ఎవరో కాదు సీ33-డెల్టా. చిన్నారి చిరుత తన తల్లి కోసం ఉరకలేయడాన్ని గమనించిన అటవీ అధికారులు.. బోను తలుపు తెరిచారు. కాసేపటికి ఆ రెండు చిరుతలు అడవిలోకి వెళ్లిపోయాయి.