ఐపీఎల్ టీమ్స్‌లో ముంబై ఇండియన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో ఈ టీం ప్రభావం ఎలా ఉంటుందో క్రికెట్ అభిమానులకు తెలిసే ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన 14 ఐపీఎల్ సీజన్‌లలో ఐదు ట్రోపీలను ముంబై ఇండియన్స్‌యే గెలుచుకుని తమకు సాటి లేదని చాటి చెప్పింది ముంబై ఇండియన్స్. పైగా, అన్ని టైటిల్స్ కూడా రోహిత్ శర్మ సారధ్యంలోనే సాధించింది. అంత గొప్ప రికార్డు ఉంది రోహిత్ శర్మకు.. అయితే, ఈ సీజన్‌లో మాత్రం ముంబై కేవలం ఒక్క గెలుపు కోసం ఇంకా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఐపీఎల్ 15వ సీజన్‌లో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ మూడు మ్యాచ్‌లు ఆడింది. కానీ గెలుపు మాత్రం దక్కింది లేదు.
ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్స్ ఎక్కువగా ఓటమితోనే సీజన్ ఆరంభిస్తుంటుంది. ఐదు సార్లు వరుసగా ఓడిపోయి కూడా చివరకు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన దాఖలాలు లేకపోలేదు. అయితే, ఈసారి కూడా ఓటమితోనే ముంబై సీజన్‌ను ప్రారంభించింది. పైగా హ్యాట్రిక్ ఓటములను తన ఖాతాలో వేసుకుంది. అయితే, బౌలింగ్ వైఫల్యంతో వరుసగా ఓడిపోతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పేసర్ బుమ్రాకు సహకరించేవారే లేరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్య, కౌల్టర్-నైల్‌ను భర్తీ చేసే ఆటగాళ్లు జట్టులో ఎవరూ లేరని అంటున్నారు. విదేశీ ప్లేయర్లలో డేనియల్ సామ్స్, టైమల్ మిల్స్, భారత్ నుంచి బాసిల్ థంపి ఎలెవన్‌లో ఉంటున్నప్పటికీ అది ప్రయోజనం చేకూర్చట్లేదని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ అంశంపై మాట్లాడారు. జయ్‌దేవ్ ఉనద్కత్ సహా బెంచ్‌లో ఉన్న కొందరిపై దృష్టిసారించాలని సూచించారు.
‘గతేడాది వరకు ఎవరైనా ప్రధాన బౌలర్ సరైన ప్రదర్శన చేయకున్నా, వారు మ్యాచ్‌కు దూరమైనా.. నాథన్ కౌల్టర్-నైల్ వంటి కొందరు కీలక పాత్ర పోషించేవారు. కానీ ఇప్పుడు ముంబయి బెంచ్ చూస్తే.. ఎవరినో తీసుకోవాలో స్పష్టత లేదు. మయాంక్ మార్కండే, జయ్‌దేవ్ ఉనద్కత్, మెరెడిత్, అర్షద్ ఖాన్‌కు ఇప్పటివరకు అవకాశం ఇవ్వలేదు. ఇంకా సంజయ్ యాదవ్, అర్జున్ తెందుల్కర్, హృతిక్ షోకీన్.. వీరితో సామ్స్, థంపిని భర్తీ చేయొచ్చు.” అని సెహ్వాగ్ చెప్పారు.
అయితే వీరందరిలోకెల్లా మంచి అనుభవం ఉన్న ప్లేయర్ ఉనద్కత్‌ను మంచి ఎంపికగా సూచించారు సెహ్వాగ్. గతంలో పుణెకు ఆడిన సమయంలో అతడు మంచి ప్రదర్శన చేశారని గుర్తుచేశారు. పవర్‌ప్లేలో 3 ఓవర్లు వేసే బౌలర్ ప్రస్తుతం ముంబైకి లేరని, బుమ్రాతో పవర్‌ప్లేలో అన్ని ఓవర్లు వేయించలేరని అన్నారు. ‘బుమ్రాకు మంచి సహకారం అందించాలంటే.. అది ఉనద్కతే’ అని వీరూ సెలవిచ్చారు.
2017 ఐపీఎల్లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌కు ఆడిన ఉనద్కత్ హ్యాట్రిక్ సహా 24 వికెట్లు తీశారు. అయితే, ఇలాంటి ప్రదర్శన మరోసారి చేయలేదు. 2018లో రాజస్థాన్ రాయల్స్ అతడిని రూ. 11.5 కోట్లు పెట్టి కొనుక్కున్నా అంతలా ఆడలేకపోయారు ఉనద్కత్. గతేడాది వరకు అదే జట్టుకు కొనసాగారు. ఈసారి మాత్రం రూ. 1.3 కోట్లకు ముంబై దక్కించుకుంది.