ఇంట్లో ఉన్నభార్యకు తెలియకుండా భర్త గర్ల్ ఫ్రెండ్ తో కలిసి విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయడం వంటి సంఘటనలు మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. కానీ ఇక్కడ నిజ జీవితంలో కూడా అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది.గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి జాలీగా మాల్దీవులకు వెళ్లాడు. తిరిగి వచ్చాక భార్యకు తెలియకుండా ఉండేందుకు పాస్‌పోర్టులోని చివరి పేజీలు చింపేశాడు.
అయితే పాస్ పోర్ట్ దుర్వినియోగం ఆరోపణలపై అతడు అరెస్టయ్యాడు. ఈ సంఘటన మహారాష్ట్ర ముంబయిలో చోటుచేసుకుంది. 32 ఏళ్ల ఇంజనీర్ ఒక ఎంఎన్ సీలో పని చేస్తున్నాడు. ఆఫీస్ పనిమీద టూర్ కు వెళ్తున్నట్లు భార్యకు చెప్పాడు. అయితే అయ్యగారు గర్ల్ ఫ్రెండ్ తో కలిసి మాల్దీవులకు వెళ్లాడు.
మరోవైపు భార్య ఆ వ్యక్తికి పలు మార్లు ఫోన్ చేసింది. అతడు మాట్లాడకపోవడంతో ఆమె అనుమానించింది. పలుసార్లు వాట్సాప్ కాల్స్ కూడా చేసింది. దీంతో ఆ వ్యక్తి తన టూర్‌ను కుదించుకున్నాడు. ఆఫీస్ పని మీద కాకుండా గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ కోసం మాల్దీవులకు వెళ్లిన సంగతి భార్యకు తెలియకూడదని భావించాడు. పాస్‌పోర్ట్‌లో సంబంధిత స్టాంప్‌లున్న పేజీలను చించివేశాడు. విమానంలో గురువారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు.
కాగా, ఆ వ్యక్తి పాస్‌పోర్ట్‌లో కొన్ని పేజీలు చించినట్లుగా ఉండటాన్ని ఇమిగ్రేషన్ అధికారులు గ్రహించారు. పాస్‌పోర్ట్ దుర్వినియోగానికి పాల్పడిన ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. దీంతో మోసం, ఫోర్జరీ కింద అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే పాస్‌పోర్ట్ బుక్‌లో పేజీలు చించివేయడం నేరమన్న సంగతి తెలియక, భార్య కళ్లుగప్పేందుకు అలా చేసినట్లు అతడు చెప్పాడని పోలీసులు తెలిపారు.