ఆత్మహత్యాయత్నం చేసిన ఓ వృద్ధున్ని ముంబై పోలీసులు కాపాడారు. ముంబైలోని మతుంగా ఈస్ట్‌లో ఓ 74 ఏళ్ల వృద్ధుడు.. కొంత కాలం క్రితం తన భార్య మృతి చెందడంతో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. ఆయన కుమార్తె(42) వృత్తిరిత్యా అమెరికాలోని టెక్సాస్ లో ఉంటోంది.
ఒంటరి తనాన్ని బరించలేక ఆ వృద్ధుడు.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఆ విషయాన్ని సోమవారం సాయంత్రం 5 గంటలకు తన బిడ్డకు ఫోన్ చేసి చెప్పాడు.ఈ మాట విన్న బిడ్డ తీవ్ర ఆందోళనకు గురై.. తక్షణమే ముంబై పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించింది.
ఎలాగైనా తన తండ్రి ప్రాణాలను కాపాడాలని వేడుకుంది. స్పందించిన ముంబై పోలీసులు..ఘటనా స్థలానికి చేరుకుని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోన్న వృద్ధుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు వివరించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే.. ఆత్మహత్యకు ముందు ఆ వృద్ధుడు సూసైడ్ నోట్ రాసిపెట్టి.. ఆస్తికి సంబంధించిన వీలునామా కూడా చేసినట్టు తెలిపాడని పోలీసులు పేర్కొన్నారు.