బహిష్కృత బీజేపీ నేత నూపుర్ శర్మకు భీవండి(మహారాష్ట్ర)పోలీసులు సమన్లు పంపారు. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల కేసుకు సంబంధించి తమ ఎదుట హాజరు కావాలని నోటిసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో ఆమె వాంగ్మూలాన్ని సోమవారం నమోదు చేయనున్నట్టు పోలీసు అధికారి చేతన్ కకడే తెలిపారు.
ఇదే కేసులో మరో నేత నవీన్ జిందాల్‌కు సైతం సమన్లు జారీ చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో జిందాల్ స్టేట్ మెంట్స్‌ను రికార్డు చేయనున్నట్టు ఆయన వివరించారు. గత నెల 30న రజా అకాడమీ ప్రతినిధి ఫిర్యాదు మేరకు వారిరువురిపై కేసులు నమోదు చేసినట్టు ఆయన వెల్లడించారు.
వివాదాస్పద వ్యాఖ్యలపై ఇప్పటికే థానే పోలీసులు నోటీసులు జారీ చేశారు. జూన్ 22 విచారణకు హాజరు కావాలని ఆమెను పోలీసులు నోటీసులు ఇచ్చారు. అలాగే చర్చకు సంబంధించిన వీడియో పుటేజ్ ను తమకు అందించాలని సదరు న్యూస్ ఛానల్ కు పోలీసులు నోటీసులు పంపారు.
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ, బీజేపీ ఢిల్లీ మీడియా ఇంఛార్జ్ నవీన్ జిందాల్ లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వారిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీజేపీ ఆదేశాలు జారీ చేసింది.