మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. ఇటీవల రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఫోర్త్ వేవ్ రానుందనే వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. దీనికి బలం చేకూర్చేలా మే 17 నుంచి చూస్తే ఇటీవల రాష్ట్రంలో కేసుల సంఖ్య 1000 రెట్లు పెరగడం అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది.
గత నెల 17న రాష్ట్రంలో రోజు వారీ కరోనా కేసుల సంఖ్య 158గా ఉంది. అదే సమయంలో యాక్టివ్ కేసుల సంఖ్య 932గా నమోదైంది. ప్రస్తుతం ఇప్పుడు యాక్టివ్ కేసుల సంఖ్య 10000 దాటింది. గత ఐదు నెలల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. రాష్ట్రంలో శనివారం కరోనా కేసుల సంఖ్య 10047గా ఉంది.
రాష్ట్రంలో శనివారం 2922 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో కేవలం ముంబై నగరం నుంచే 1745 కేసులు ఉండటం గమనార్హం. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 59శాతం కేసులు ముంబై నగరంలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దేశంలో నమోదవుతున్న కేసుల్లో 5వ వంతు కేసులు ముంబై నుంచి నమోదవుతుండటంతో అధికారులు వణికిపోతున్నారు.
జూన్ 1 నుంచి చూస్తే దేశంలో నమోదవుతున్న కేసుల్లో 18 నుంచి 24 శాతం కేసులు ముంబైలో నమోదైనట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. ఫోర్త్ వేవ్ భయాల నేపథ్యంలో కరోనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.