దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరాన్ని కరోనా వైరస్ మరోసారి గడగడలాడిస్తోంది. తగ్గినట్లే తగ్గిన కరోనా కేసులు మరోసారి భారీగా పెరుగుతున్నాయి. ముంబైలో షరతులను ఎత్తివేయటంతో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఫలితంగా గత డిసెంబర్ నెల తర్వాత మరోసారి ఇప్పుడు అత్యధిక కేసులు నమోదయ్యాయి.
చాలా రోజుల తర్వాత ముంబైలో అత్యధికంగా 823 కొత్త కేసులొచ్చాయి. దీంతో ఒక్క ముంబై నగరంలోనే కేసుల సంఖ్య 3,17,310కి చేరాయి. 11,435మంది మరణించారు. ముంబైలో ప్రస్తుతం 6,577 యాక్టివ్ కేసులున్నాయి.
ఈ వైరస్ వ్యాప్తి… మరోసారి ధరావికి తాకితే కేసుల సంఖ్య అంతకంతకు పెరిగిపోయే ప్రమాదం ఉందని అధికారులు మదనపడుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరున్న ధరావిలో గతంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇక మొత్తం మహారాష్ట్రలో కొత్త కేసుల సంఖ్య 6వేలకు చేరింది. దీంతో కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలంటూ సీఎం ఉద్ధవ్ థాక్రే జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు.