పులిహోర, పొంగల్, దద్దోజనం,లడ్డు, మిఠాయి లాంటి పదార్థాలను నైవేద్యంగా స్వీకరించే దేవీదేవతలను చూసాం. కానీ ఈ దేవుడుకి అలాంటివి నచ్చవు చాక్లెట్ మాత్రమే స్వీకరిస్తాడు. ఇదేంటి దేవుడికి చాక్లెట్ నైవేద్యమేంటి అనుకుంటున్నారా…!? అయితే కేరళ రాష్ట్రంలోని ‘తెక్కన్ పలని’ బాల సుబ్రమణ్య (కుమారస్వామి) గురించి తెలియాల్సిందే..!
ఈ ఆలయంలో భక్తులు చాకోలేట్లను నైవేధ్యంగా సమర్పించుకుంటారు. అవును, గత ఆరు సంవత్సరాలుగా ఈ ప్రదేశం మంచ్ మురుగన్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఒక చిన్న పిల్లవాడు బాలమురుగన్‌కు మంచ్ చాక్లెట్ అందించిన తర్వాత, భగవంతుడు అతన్ని మెచ్చుకున్నాడని ఇక్కడి భక్తుల నమ్మకం.
ఆలయ నిర్వహణ చేస్తున్న అనుప్ ఎ.చెమ్మోత్ మాట్లాడుతూ..గతంలో ఈ ఆలయంలో దేవుళ్లందరికీ పండ్లు, పూలు తదితర పూజలు చేసేవారని, అయితే 6 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన తర్వాత ఇప్పుడు భక్తులంతా మంచ్ చాక్లెట్‌ను అందజేస్తున్నారని తెలిపారు.
పరీక్షల సమయంలో పిల్లలు కూడా తమ ఇష్టదైవమైన బాల మురుగన్‌ని దర్శించుకుని చాక్లెట్ నైవేధ్యం సమర్పించుకుంటారు.ఇది కాకుండా, ఈ ఆలయంలో కుల, మతాలకు అతీతంగా భక్తులందరికీ మంచ్ చాక్లెట్‌ను ప్రసాదంగా అందజేస్తారు.