టీఆర్ఎస్ పార్టీలో మున్సిపల్ ఎన్నికలు చిచ్చు రేపుతున్నాయి. ముందు నుండి పార్టీలో ఉన్న నేతలకు తోడు, పార్టీ అధికారంలోకి వచ్చాక చేరిన నేతల మధ్య టికెట్ పంచాయితీ తారా స్థాయికి చేరింది. దీంతో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టు పక్కలా, నిజామాబాద్, కరీంనగర్ కార్పోరేషన్ల పరిధిలో ఈ టికెట్ లొల్లి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్నో ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్న నేతలకు గెలుపు గుర్రాల పేరుతో టికెట్ నిరాకరిస్తుండటంపై టీఆరెఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. డబ్బులుంటేనే సీటు అని కొన్ని చోట్ల, గెలిచే వారికే సీటు అని కొన్ని చోట్ల ఉద్యమ నేతలపై చిన్న చూపు చూస్తున్నారన్న విమర్శలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇక ఆయా పార్టీల్లో గెలిచి టీఆర్ఎస్‌కు వలస వచ్చిన ఎమ్మెల్యేలున్న చోట ఉద్యమ టీఆరెఎస్ నాయకులకు సీట్లు దక్కటం లేదని, వారి అనుచరులకే కొత్త నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు వినపడుతున్నాయి. టీఆర్ఎస్ అధినేత అందరిని కలుపుకొని పోవాలని చెప్పినప్పటికీ, గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని.. గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలేదని చెప్పటంతో ఎమ్మెల్యేలు సైతం తమకు నచ్చిన వారికి టికెట్ ఇచ్చుకుంటున్నారని తెలుస్తోంది.
కొన్ని చోట్ల నేతలంతా ఇప్పటికే పార్టీకి గుడ్‌బై చెప్పగా, కొందరు సైలెంట్ అయిపోతున్నారు. ఇన్నాళ్లు పార్టీనే నమ్ముకొని ఉంటే… చివరకు పైసలుంటేనే టికెట్ పేరుతో పక్కనపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.