టీఆర్‌ఎస్ పాలనలో మహిళలకు అవమానాలు కొత్తేం కాదు. ఇది సొంత పార్టీలోని మహిళా నేతలకు సైతం వర్తిస్తుంది. తరచూ బయటకొస్తున్న ఘటనలే అందుకు నిదర్శనం. తాజాగా సొంత పార్టీ వాళ్లే అవమానించారంటూ కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి బోరున విలపించడం చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. కేంద్రానికి వ్యతిరేకంగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో లక్ష్మీదేవి పల్లి మార్కెట్ యార్డ్ నుండి రామాపురం వరకు నల్లజెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ ద్విచక్ర వాహనం వెనుకవైపు కూర్చున్నారు మున్సిపల్ చైర్ పర్సన్ సీతాలక్ష్మి. ఆమె వెళ్తున్న వాహనం వెనుకే కౌన్సిలర్ భర్త బైక్ పై వస్తున్నాడు. చైర్ పర్సన్ ను పదేపదే బైక్ తో తాకుతూ ఆకతాయిలా ప్రవర్తించాడు. “అన్నా కాస్త చూసి నడపండి.. బండి నాకు తాకుతోంది” అని చెప్పినా వినిపించుకోలేదు.
మూడు సార్లు అదేపనిగా బండితో మళ్లీ మళ్లీ సీతాలక్ష్మిని ఢీకొట్టాడు. దీంతో ఆమె ఒక్కసారిగా కిందపడిపోయింది. పలుమార్లు ఢీకొనటం వల్ల తన చీర జారిపోయినంతపనైందని వాపోయారు చైర్ పర్సన్. తనకు కలుగుతున్న ఇబ్బందిని చెప్తున్నా పట్టించుకోకుండా.. మొండిగా ప్రవర్తించారని కన్నీటి పర్యంతమయ్యారు. దండం పెడతా అని ప్రాధేయపడ్డా వినిపించుకోలేదని ఆమె కన్నీరుమున్నీరయ్యారు.
బైక్ ర్యాలీ మధ్యలోనే ఓ ఇంటికి వెళ్లి చీర సరి చేసుకుని వచ్చారు చైర్ పర్సన్ సీతాలక్ష్మి. కౌన్సిలర్ భర్త ఇలా చేయడం సమంజసం కాదని రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఎమ్మెల్యే ఎంట్రీ ఇచ్చి ఆమెకు సర్దిచెప్పి ఇంటికి తీసుకెళ్లారు.
ఇంటికి వెళ్లాక బోరున విలపించింది సీతాలక్ష్మి. ప్రజా ప్రతినిధులు అయ్యుండి ఆడవారితో ఆకతాయిల్లా ప్రవర్తించడం ఎంత మాత్రం సమంజసం కాదని.. తక్షణమే ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని వనమా వెంకటేశ్వరరావును వేడుకుంది. గురువారం మహబూబాబాద్ లో ఏర్పాటు చేసిన నిరసన దీక్షలో ఎంపీ మాలోతు కవితకు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు మధ్య జరిగిన ఘటన మరువకముందే చైర్ పర్సన్ విషయం బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.