నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మునుగోడు నియోజక వర్గంలో నవంబర్ 3న పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ లో వెల్లడించింది.
ఉపఎన్నికల నోటిఫికేషన్ ను అక్టోబర్ 7న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నామినేషన్ల ప్రక్రియను అదే రోజు నుంచి ప్రారంభించనున్నారు. అక్టోబర్ 14తో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనుంది. నామినేషన్ల పరిశీలనను అక్టోబర్ 15న నిర్వహించనున్నారు.
అక్టోబర్17వ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అనుమతించనున్నారు. పోలింగ్ ను వచ్చే నెల 3న నిర్వహించనున్నారు. అనంతరం వచ్చే నెల 6న ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నారు. అంతకు ముందు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికను నిర్వహిస్తున్నారు.
మునుగోడుతో పాటు మహారాష్ట్రలోని అందేరీ తూర్పు, బిహార్ లోని మొకామా, గోపాల్ గంజ్,హర్యానాలోని అదమ్ పూర్, యూపీలోని గోలా గోకర్ నాథ్ ,ఒడిశాలోని ధామ్ నగర్ నియోజక వర్గాల్లో కూడా ఉపఎన్నికను నిర్వహించనున్నారు.