తెలంగాణ రాష్ట్రం లోని మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఈరోజు నోటిఫికేషన్ వెలువడనుంది. నేటి నుంచి ఈ నెల నేటి నుంచి ఈ నెల 14 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనున్నది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ ఉప ఎన్నికలు ప్రధాన పార్టీలకు చావోరేవో అన్నట్లు తయారయ్యాయి. ఈ రోజు నుంచే మునుగోడు నియోజకవర్గంలో అసలు పర్వం మొదలుకానుంది. అధికారులు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ మేరకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు.
చండూరులోని ఎమ్మార్వో కార్యాలయంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ పత్రాలను దాఖలు చేయవచ్చు. ఈ నెల 14 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 15న నామినేషన్లను పరిశీలిస్తారు. అక్టోబరు 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. రెండో శనివారం, ఆదివారం రోజుల్లో నామినేషన్లను స్వీకరించబడవు. ఉప ఎన్నికను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మరోవైపు న్నికల కోడ్ ఈ నెల 3 నుంచే అమల్లోకి వచ్చింది.
ఈ నెల 10 న బీజేపీ నుంచి నామినేషన్ దాఖలు చేయనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 11 న కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి 2 సెట్లతో నామినేషన్ వేయనున్నారు. 14 న మరోసారి భారీ ఎత్తున నామినేషన్ వేయనున్న స్రవంతి. ఈనెల 12న టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు అధికారికంగా ప్రకటించే అవకాశం. 13 లేదా 14న టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ఈనెల 14 లోగా సీఈసీ గుర్తిస్తే మునుగోడులో బీఆర్ఎస్ తరుపున కూసుకుంట్ల పోటీ.లేదంటే టీఆర్ఎస్ తరపున పోటీ చేయనున్న ప్రభాకర్ రెడ్డి.
ఇదిలా ఉంటే నోటిఫికేషన్ రాకముందే మునుగోడులో ప్రధాన రాజకీయ పార్టీలు తెగ ప్రచారం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో నేటి నుంచే నామినేషన్‌లు మొదలుకానుండడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు సిద్ధమయ్యాయి. ముఖ్యమైన లీడర్లంతా మునుగోడులోనే మక్కాం వేయనున్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ.. ఈ ఉపఎన్నికను ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలనంతా మునుగోడులో దింపి.. ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది.
2,500 ఓటర్లకు ఒక ఎమ్మెల్యే చొప్పున.. 86 మంది ఎమ్మెల్యేలు మునుగోడులోనే ఉండాలని పార్టీ హైకమాండ్ ఆదేశించింది. అయితే ఇప్పటివరకు అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించలేదు. రేపోమాపో లేదా చండూరులో తలపెట్టే బహిరంగ సభలో అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇక మునుగోడు ఉప ఎన్నికకు నవంబరు 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. నవంబరు 6న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.