టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా దద్దమ్మలా అంటూ ఘాటుగా ప్రశ్నించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. మునుగోడు బై ఎలక్షన్స్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు ఎంపీ లక్ష్మణ్. మునుగోడును కేటీఆర్ దత్తత తీసుకుంటాన్న వ్యాఖ్యలపై లక్ష్మణ్ స్పందిస్తూ.. కేసీఆర్, కేటీఆర్ దత్తత తీసుకుంటేనే అభివృద్ధి జరుగుతుందా? లేక పోతే జరగదా అంటూ నిలదీశారు. మరి రాష్ట్రంలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాలను కేటీఆర్ ఎందుకు దత్తత తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ కు ఉప ఎన్నికలు ఊపిరిపోశాయని.. ఇప్పుడు రాష్ట్రంలో వచ్చిన బైపోల్స్ టీఆర్ఎస్ పాలిట శాపంగా మారాయని తెలిపారు. ప్రజల్లో కేసీఆర్ పాలనపై వ్యతిరేకత మొదలైందన్నారు. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపించిందని తెలిపారు. ఉప ఎన్నికలు అంటే టీఆర్ఎస్ నాయకులకు వెన్నులో వణుకు పుడుతోందని లక్ష్మణ్ ఆరోపించారు. మునుగోడులో ఏ మాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. కేసీఆర్ అసహనంతో మునుగోడులో లబ్ది పొందేందుకు కొత్త మండలంతో పాటు గిరిజన బంధు ప్రకటించారని అన్నారు.
కుల వృత్తులపైన ఆధారపడిన బీసీల ఫెడరేషన్, కార్పొరేషన్లకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఓడిపోతామనే భయంతో తోక పార్టీలని విమర్శించిన కేసీఆర్ కమ్యూనిస్టులతో జత కట్టారని అన్నారు. డబ్బు, మద్యం పంచుతూ టీఆర్ఎస్ నేతలు మునుగోడు ప్రజలను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవానికి, కేసీఆర్ అహంకారానికి మధ్య జరుగుతున్న పోరాటంగా లక్ష్మణ్ అభివర్ణించారు. అందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని మంత్రులు, ఎమ్మెల్యేలను మునుగోడుకు పంపించారని కేసీఆర్ పై మండిపడ్డారు.
మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తోందని కేసీఆర్, కేటీఆర్ చెబుతున్నారని, అదే నిజమైతే పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడులో మకాం వేయాల్సిన అవసరమేమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకుంటానని కేటీఆర్ చెబుతున్నారన్న లక్ష్మణ్… కేటీఆర్ దత్తత తీసుకుంటేనే అభివృద్ధి జరిగితే.. మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దద్దమ్మలా అని ప్రశ్నించారు. మునుగోడు అభివృద్ధి కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని, ప్రజలు ఆయనని భారీ మెజారిటీతో గెలిపించి టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్.