మునుగోడుని దత్తత తీసుకుంటానంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మునుగోడులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈ నియోజకవర్గానికి ప్రత్యేక ప్యాకేజీ ఇప్పించే బాధ్యత తనదని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి తన ఓటు తానే వేసుకోలేడని ఎద్దేవా చేశారు.
తన ఓటు తాను వేసుకోలేని రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజలను ఓట్లు వేయమని కోరుతున్నాడని సెటైర్లు వేశారు రేవంత్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డికి మునుగోడులో ఊరు లేదు, అసెంబ్లీలో నోరు లేదని విమర్శించారు. తన రక్తం దారపోసైనా సరే ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే.. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని మునుగోడుకు తీసుకువస్తానని ప్రజలకు మాట ఇచ్చారు. అలాగే డిండి ప్రాజెక్టుకు రూ.5 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇప్పిస్తానన్నారు రేవంత్.
మునుగోడు నియోజక వర్గ ప్రజలు ఇప్పటికైనా ఆలోచించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు రేవంత్. 2023లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. మునుగోడుని తానే దత్తత తీసుకుంటానని తెలిపారు రేవంత్. అలాగే మునుగోడులో జూనియర్ కాలేజీ, చౌటుప్పల్ లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు.
ఇవన్నీ కావాలంటే మునుగోడులో కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉందన్నారు రేవంత్. గాడిదకు గడ్డి వేసి.. బర్రెకు పాలు పిండితే రావన్నారు. 2014, 2018 లో వారికి అవకాశం ఇచ్చారని.. ఈ సారి మాకు ఓ అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.