సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని తెగ ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. మునుగోడులో మరోసారి సత్తా చాటాలని చూస్తోంది. అభ్యర్థి స్రవంతి ఇంటింటికీ ప్రచారం సాగిస్తున్నారు. మూడు రోజులుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ ఒక్కో మండలాన్ని చుట్టేస్తున్నారు. నేడు చండూరులో పర్యటన ఉంది. అయితే, రేవంత్ టూర్ కు ముందు కాంగ్రెస్ ఆఫీస్ లో అగ్నిప్రమాదం కలకలం రేపింది.
చండూరు మండల కాంగ్రెస్ కార్యాలయంలో చెలరేగిన మంటలతో ప్రచార సామాగ్రి దగ్ధమైంది. దీనిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు హస్తం నేతలు. గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారని అంటున్నారు. దాదాపు రూ.5 లక్షల విలువైన సామాగ్రి దగ్ధమైందని చెబుతున్నారు.
ప్రచారం కోసం సిద్ధం చేసిన జెండాలు, పోస్టర్లు కాలి బూడిదయ్యాయి. ఉప ఎన్నిక కోసం ఇటీవలే చండూరులో ఆఫీస్ ప్రారంభించింది కాంగ్రెస్. ఇక్కడి నుంచే నియోజకవర్గానికి పోస్టర్లు, జెండాల పంపిణీ జరుగుతోంది. తమ కార్యక్రమాలను అడ్డుకోవాలని కుట్రలో భాగంగా వీటిని తగులబెట్టారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
మునుగోడు బైపోల్ ను హస్తం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. ఈ తరుణంలో ప్రచార సామాగ్రిని తగులబెట్టడం కలకలం రేపుతోంది.