కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వీడనున్నట్టు వార్తలు వస్తున్నాయి. బీజేపీలో ఆయన చేరికకు అంతా సిద్దమైనట్టు వార్తలు గుప్పుమంటున్నాయి.
ఈ క్రమంలో కాంగ్రె’స్ హై కమాండ్ ఆదేశాల మేరకు రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించేందుకు ఆయనతో ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ వేర్వేరుగా భేటీ అయ్యారు.
భేటీ అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… మునుగోడు తీర్పు తెలంగాణలో మార్పుకు నాంది కావాలని ఆయన అన్నారు. ఉప ఎన్నిక అనేది సీఎం కేసీఆర్ భావించినప్పుడు రాదనీ, అది ప్రజలు సిద్ధంగా ఉంటేనే వస్తుందన్నారు.
రానున్న రోజుల్లో యుద్ధం ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇది రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న యుద్ధం కాదన్నారు. ఇది కేసీఆర్ కుటుంబానికి, ప్రజలకు మద్య జరిగే మహా యుద్ధమని తెలిపారు.
రాష్ట్రంలో అభివృద్ధిని కేవలం సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్కే పరిమితం చేశారని ఆయన మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పే ఎన్నిక వస్తుందని చెప్పారు. 10-15 రోజుల్లో యుద్ధం ప్రకటిస్తానని వెల్లడించారు. తన రాజీనామాపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు.