మురళీశర్మ.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. తెలుగులో దాదాపు ప్రతి సినిమాలో కనిపిస్తాడీ నటుడు. అటు తమిళ్, హిందీ, మరాఠీ, మలయాళంలో కూడా చాలా సినిమాలు చేశాడు. మరి ఇలాంటి సీనియర్ మోస్ట్ నటుడు అడుగుపెట్టని ఇండస్ట్రీ ఏదైనా ఉందా? ఉంది.. అదే శాండిల్ వుడ్. అవును.. కన్నడనాట ఈ నటుడు ఇప్పటివరకు అడుగు పెట్టలేదు. ఇప్పుడా టైమ్ రానే వచ్చింది.
ఉపేంద్ర చేస్తున్న పాన్ ఇండియా సినిమా కబ్జాతో కన్నడనాట అడుగుపెడుతున్నాడు మురళీశర్మ. ఈ సీనియర్ మోస్ట్ నటుడికి ఇదే తొలి కన్నడ చిత్రం అని చెప్పుకుంటే కాస్త ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఇది నిజం. ఇప్పటివరకు 200లకు పైగా చిత్రాల్లో నటించాడు మురళి. భిన్నమైన పార్శ్వాలను చూపించాడు. అవార్డులు అందుకున్నాడు. మరీ ముఖ్యంగా వెండితెరపై పోలీసు పాత్ర పోషించడంలో పాపులర్ అయ్యాడు. అలాంటి ఈ నటుడు, కబ్జా చిత్రంలో వీర్ బహద్దూర్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు.
“అల వైకుంఠపురములో చేసిన పాత్ర ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టింది. మా సినిమాలో కీలకమైన పాత్రలో నటించేందుకు ఆయనను సంప్రదించాలని నిర్ణయించుకుకోవడానికి ఇదే కారణం” అంటూ మురళీశర్మ ఎంపిక వెనక రీజన్ ను బయటపెట్టాడు కబ్జా సినిమా దర్శకుడు చంద్రు.
అటు మురళీశర్మ కూడా తొలిసారి ఓ కన్నడ సినిమాలో నటించడం చాలా థ్రిల్ గా ఉందని ప్రకటించాడు. తనకు కన్నడం రాకపోయినప్పటికీ.. చంద్రు సూచనలతో బాగా నటించానని చెప్పుకొచ్చాడు. పాన్ ఇండియా సినిమాగా త్వరలోనే థియేటర్లలోకి రాబోతోంది కబ్జా.