ఓ మర్డర్ కేసులో నిందితుడిని కోర్టు హాల్ లోనే కాల్చివేసిన సంఘటన పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ లో జరిగింది. షా నవాజ్ అన్సారీ డబుల్ మర్డర్ కేసులో నిందితుడు. అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న అతనిని సోమవారం బిజ్నోర్ లోని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణకు తీసుకొచ్చారు. కోర్టు విచారణ జరుగుతుండగానే అప్పటికే కోర్టులో ఉన్న ముగ్గురు వ్యక్తులు పిస్తోల్లు తీసి షా నవాజ్ అన్సారీపై కాల్పులు జరిపారు. దుండగులు కాల్పులు జరపడంతో మెజిస్ట్రేట్ తో సహా కోర్టు ఉద్యోగులంతా భయంతో టేబుళ్ల చాటున దాక్కున్నారు.ఈ కాల్పుల్లో గాయపడ్డ ఓ కోర్టు ఉద్యోగిని హాస్పిటల్ కు తరలించారు.
ఈ సంవత్సరం మే లో బహుజన్ సమాజ్ పార్టీ నేత హాజీ హాసన్ ఖాన్, అతని అల్లుడి హత్య కేసులో నిందితుడైన షా నవాజ్ అన్సారీ హత్యానంతరం ఢిల్లీ పోలీసులకు లొంగిపోయాడు. అప్పటి నుంచి జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్న అతనిని మొదటి సారిగా విచారణకు హాజరయ్యరు. షా నవాజ్ అన్సారీ చేతిలో హత్యకు గురైన బీఎస్పీ నేత హాజీ హాసన్ కుమారుడు, మరో ఇద్దరు ఈ కాల్పులు జరిపినట్టు గుర్తించారు. కాల్పులు జరిపి పారిపోతున్న వారిని కోర్టు హాల్ లో ఉన్న పోలీసులు వెంటాడి పట్టుకున్నారు.