హైదరాబాద్ దారుణం చోటుచేసుకుంది. జియాగూడలో ఓ వ్యక్తిని ముగ్గురు దుండగులు అందరూ చూస్తుండగానే కత్తులు, వేటకొడవళ్లతో అతికిరాతకంగా నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జియాగూడ బైపాస్ రోడ్డుపై ఆదివారం ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వెళ్లాడు. అతన్ని తరుముకుంటూ వెనకే ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఆ వ్యక్తిని చుట్టు ముట్టి కత్తులు, వేటకొడవళ్లతో విచక్షణారహితంగా నరికి చంపారు. కుల్సుంపురా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతున్ని కోఠి ఇసామియా బజార్‌కు చెందిన జంగం సాయినాథ్(32)గా పోలీసులు గుర్తించారు. కేసులో నిందితులు ఎవరు? ఆ వ్యక్తిని ఎందుకు హత్య చేసి వుంటారు? అని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ హత్యను చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
హత్య అనంతరం పక్కనే ఉన్న మూసి నదిలో దూకి నిందితులు పారిపోయినట్టు స్థానికులు పేర్కొన్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు సీఐ తెలిపారు. హత్య జరుగుతుండగా ఓ వ్యక్తి వీడియో తీశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.