2012 మే లో క్రైస్తవ మత బోధకుడు, గ్లోబల్ పీస్ ఇన్షియేటివ్ ఫౌండర్, ప్రెసిడెంట్ కె.ఎ. పాల్ అరెస్ట్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఒంగోలులో తన ప్రజా శాంతి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వెళ్లిన పాల్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పాల్ తన సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కోటేశ్వర్ రావుతో కలిసి హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో అరెస్ట్ చేశామని పోలీసులు అప్పట్లో చెప్పారు. అయితే ఈ కేసు అప్పట్లో రాజకీయ రంగు పులుముకుంది. దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, ఆయన అల్లుడు బ్రదర్ అనిల్ తో ఉన్న వివాదాల కారణంగానే తన సోదరుడి హత్యతో ఎలాంటి సంబంధం లేకున్నప్పటికీ పోలీసులు పాల్ ను అరెస్ట్ చేసి విచారించినట్టు పుకార్లు వ్యాపించాయి.
అయితే సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసుతో పాల్ కు ఎలాంటి సంబంధం లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో 2012 మే 21న పాల్ ను కస్టడీలోకి తీసుకున్న అప్పటి పోలీస్ సర్కిల్ ఇన్ స్పెక్టర్, ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ లో ఉన్న ఐ.శ్రీనివాసరావే అతన్ని అరెస్ట్ చేసినప్పటికీ నేరం చేసినట్టు విచారణలో తేలకపోవడంతో కేసును ఉపసంహరించుకున్నారు. ఒంగోలు అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు లో ఉన్న కేసును క్లోజ్ చేయడానికి అభ్యంతరం లేదని నివేదిక ఇచ్చాడు.
పోలీస్ అధికారి శ్రీనివాసరావు ఇచ్చిన నివేదిక ప్రకారం కేసును మూసివేయాల్సిందిగా కోరుతూ ఒంగోలు జిల్లా ఎస్పీ కోర్టుకు లేఖ రాశారు. డేవిడ్ రాజు హత్య కేసులో మత బోధకుడు కె.ఎ. పాల్ కు ఎలాంటి సంబంధం లేదని తమ దర్యాప్తులో తేలిందని…అతన్ని ప్రాసిక్యూట్ చేయడానికి ఎలాంటి ఆధారాలు లేనందున కేసు మూసివేయాల్సిందిగా ఎస్పీ ఆ లేఖలో కోరారు.
Advertisements