- ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము..
- ముర్ము వ్యక్తిగత జీవితం ఆదర్శం..
- స్వాతంత్య్ర పోరాటంలో ముర్మూ వంశస్థుల పాత్ర ఏంటి..?
ద్రౌపది ముర్ము.. నిన్నటి నుంచి ఈ పేరు టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అత్యంత వ్యూహాత్మకంగా గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎవరీ ద్రౌపది ముర్ము అని దేశ ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ద్రౌపది ముర్ము ఎదుగుదల భారత ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప పాఠానికి ప్రతీక. రాజకీయంగా ఉజ్వల జ్యోతిలా వెలుగుతున్నా.. ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని నిలిచిన ఆమె ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు.
ఈస్టిండియా కంపెనీపై 1855 లో మొదటి సాయుధ తిరుగుబాటు చేసింది సంథాల్ తెగవారు.., కాగా, నాయకత్వం వహించింది ముర్ము వంశస్తులు. భారత స్వాంతంత్ర్య పోరాటంలో ముర్ము వంశస్తుల పాత్ర అద్వితీయం. అలాంటి మహోన్నత చరిత్ర కలిగిన వారిని గౌరవించి రాష్ట్రపతి పదవికి ద్రౌపది ముర్ము గారిని ఎంపిక చేయడం శుభ పరిణామం. బీజేపీ ఆజాది కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా సంథాల్ సాయుధ పోరాటంలో అసువులు బాసిన పదిహేనువేల మంది ఆదివాసీలకు నివాళులర్పించడమే కాకుండా వారి పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు.
గిరిజన తెగల తిరుగుబాట్లలో అతి గొప్పది, ఘనమైంది సంథాల్ తిరుగుబాటు. సిద్ధు, కన్హూ ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. సంథాల్ తిరుగుబాటు, ప్రస్తుత జార్ఖండ్ ప్రాంతంలో ఈస్టిండియా కంపెనీకి, జమీందారీ వ్యవస్థకూ వ్యతిరేకంగా జరిగిన సాయుధ తిరుగుబాటు. ఇది 1855 జూన్ 30 న ప్రారంభమై.. 1856 జనవరి 3 న ప్రెసిడెన్సీ సైన్యాలను అణచివేసి, మార్షల్ లా ఎత్తివేయడంతో ఈ తిరుగుబాటు ముగిసింది. ఈ తిరుగుబాటుకు సిద్ధు ముర్ము, కన్హు ముర్ము, చాంద్ ముర్ము, భైరవ్ ముర్ము అనే నలుగురు ముర్ము సోదరులు నాయకత్వం వహించారు.
సంథాల్ తెగకు చెందిన ప్రజలు అప్పటి ప్రభుత్వం దోపిడీ శక్తులకు చేయూత నివ్వడంతో, పరాయి పాలనపై ‘సంథాలులు’ ధ్వేషం పెంచుకున్నారు. జమీందార్లు, పోలీసులు, పన్ను వసూలు చేసే అధికారులు పెత్తనం చెలాయించేవారు. బలవంతంగా ఆస్తులను వశపర్చుకోవడం, వ్యక్తిగత హింసకు పాల్పడటం లాంటి నిరంకుశ చర్యలు గిరిజనులను మరింత కుంగదీశాయి. అప్పులకు అధిక వడ్డీలు చెల్లించాల్సి వచ్చేది. ఫలసాయ అమ్మకాల సమయంలో తూనికలు, కొలతల్లో దోపిడీ జరిగేది. గిరిజనులకు చెందిన పంటకు వచ్చిన చేలల్లోకి ధనవంతులు తమ పశువులను తోలి నష్టం కలిగించేవారు. దీంతో తిరుగుబాటుకు బీజం పడింది.
వేతనాలను ఇవ్వకపోవడంతో సహనం కోల్పోయిన సంథాలులు తిరుగుబాటు చేశారు. జమీందార్లు, తోట యజమానులు, రైల్వే ఉద్యోగులు, పోలీసు అధికారులు, వర్తకులు, రైతుల గృహాలపై దాడికి పాల్పడ్డారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించి ప్రభుత్వానికి సవాలుగా నిలిచారు. సంథాలు ఆధునిక భారతదేశ చరిత్రలో తొలి స్వతంత్ర గిరిజన రాజ్యాన్ని ఏర్పరుచుకున్నారు. 1857 సిపాయిల తిరుగుబాటుకు ప్రేరణగా నిలిచారు.