దివంగత పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఒకప్పుడు ఇండియాతో సన్నిహితంగానే మెలిగారంటే నమ్మలేం. 1943 ఆగస్టు 11 న ఆయన ఢిల్లీలోని ఓ సాధారణ ఆసుపత్రిలో జన్మించారు. ఓ వైపు రెండో ప్రపంచ యుద్ధం, మరో వైపు భారత స్వాతంత్య్ర పోరాట ఉద్యమం పెద్దఎత్తున సాగుతున్న కాలమది !1947 లో భారత పాకిస్తాన్ విభజన అనంతరం ముషారఫ్ కుటుంబం నాడు కొత్తగా ఏర్పడిన పాకిస్థాన్ కు వలస వెళ్ళింది. ఆ తరువాత ఆరు దశాబ్దాలకు 2005 ఏప్రిల్ లో ముషారఫ్ ఇండియాకు వచ్చి తన బర్త్ డే సర్టిఫికెట్ తీసుకున్నారంటే ఆశర్యం కలగక మానదు.
ఈ సర్టిఫికెట్ ని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దీన్ని ఆయనకు గిఫ్ట్ గా ఇచ్చింది. 1943 లో ముషారఫ్ పుట్టిన ఆసుపత్రి .. ఢిల్లీ కమలానగర్ మార్కెట్లో ఉండేది. అప్పటికే ఓల్డ్ ఢిల్లీలోని రెండు పురాతన ఆసుపత్రుల్లో ఇదొకటి. ముషారఫ్ పుట్టిన రోజు నాటి సర్టిఫికెట్ ను ఆరు దశాబ్దాల తరువాత కూడా ఈ హాస్పిటల్ లో భద్రంగా ఉంచారని నాటి మాజీ ఉద్యోగి ఒకరు తెలిపారు.
అప్పుడు కంప్యూటర్స్ వంటివేవీ ఉండేవి కావని, భద్రంగా ‘మ్యాన్యువల్’ గా దీన్ని ఉంచినట్టు ఆయన చెప్పారు. 2005 ఏప్రిల్ 17 న మూడు రోజుల పర్యటనకు గాను ముషారఫ్ తన భార్యతో సహా ఇండియా వచ్చారు. (2001 జులై 15 న ఆయన తన భార్యతో బాటు ఆగ్రా లోని తాజ్ మహల్ ని విజిట్ చేశారు.).
ఆనాడు ఆయన అజ్మీర్ షరీఫ్ వెళ్లి అక్కడి సూఫీ సెయింట్ ఖ్వాజా మొయినుద్దీన్ ఛిస్టీ దర్గాను సందర్శించారు. కరాచీకి వెళ్లేముందు ఆయన తల్లి కూడా ఈ దర్గాను విజిట్ చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. దుబాయ్ లో ముషారఫ్ ఆదివారం కన్ను మూశారని తెలిసి దిగ్భ్రాంతి చెందామని ఆ మాజీ ఉద్యోగి చెప్పారు.