యూనివర్శిటీ ఆఫ్ ది వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ కు చెందిన శాస్త్రవేత్త ఆండ్రూ అడమట్జ్కీ సంచలన విషయాలను వెల్లడించారు. పుట్టగొడుగులు ఒక దానితో ఒకటి మాట్లాడుకుంటాయని తన పరిశోధనల్లో వెల్లడైనట్టు ఆయన తెలిపారు. సుమారు 50 వరకు పదాలను పుట్టగొడుగులు గుర్తిస్తాయని తెలిపారు.
నాలుగు రకాల శిలీంధ్రాల విద్యుత్ కార్యకలాపాల(ఎలక్ట్రిక్ యాక్టివిటీ)పై ఆయన పరిశోధనలు జరిపారు. అందులో విద్యుత్ ప్రేరణలు నిర్మాణాత్మకంగా మానవ సంభాషణలను పోలి ఉంటాయని పరిశీలించినట్టు పేర్కొన్నారు.
ఫంగస్(పుట్టగొడుగు)లు విద్యుత్ ప్రసారాల, ఎలక్ట్రిక్ స్పైక్ ల ద్వారా తమ ఆహారం, గాయాల గురించి సమాచారాన్ని ఇతర ఫంగస్ లకు చేరవేస్తాయన్నారు. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి తాను ఈనోకి, స్ప్లిట్ గిల్, ఘోస్ట్, క్యాటర్ పిల్లర్ పుట్టగొడుగుల్లో ఎలక్ట్రికల్ స్పైక్ లను పరిశీలించినట్టు పేర్కొన్నారు.
ప్రత్యేకమైన పరికరాల ద్వారా రికార్డు చేసి వీటిని గణిత భాషలోని బైనల్ స్ట్రింగ్ లోకి మార్చి పరిశోధనలు జరిపినట్టు వెల్లడించారు. పుట్టగొడుగులు ఒక దానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకునేందుకు 50 వరకు పదాలను ఉపయోగిస్తున్నట్టు ఇందులో తేలిందన్నారు. ఆశ్చర్యకరంగా ఇది మానవులు ఉపయోగించే బాషను పోలివున్నట్టు గమనించానని వివరించారు.