తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం కురిసిన వాన కాస్త తగ్గిందిలే అనుకునేంతలోపే మళ్లీ వరద ముంచుకోస్తుంది. శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది.దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలోని జంట జలశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లకు భారీగా నీరు చేరడంతో…గేట్లు తెరిచి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు.
హిమాయత్ సాగర్ రెండు గేట్లు ద్వారా 330 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు అలుగు పోస్తోంది. ఈ చెరువుకు కొంపల్లి, దూలపల్లి,గుండ్లపోచంపల్లి నుంచి పెద్ద ఎత్తున వరద వస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. మూసీలోకి నీటిని విడుదల చేస్తుండటంతో ప్రజలు భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నామని లోతట్టు ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు.