భిన్నత్వంలో ఏకత్వం.. ఏకత్వంలో భిన్నత్వం భారతదేశం సొంతం. ఇందులో భాగంగానే పరమత సహనం, మత సామరస్యం పాటించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, హిందూ ముస్లిం భాయీ భాయీగా కలిసి మెలిసి ఉండే దేశంలో ఇటీవల పరమతాలపై పలువురు అసహనం వ్యక్తపరుస్తున్నారు. అంతేకాదు, హింసకు అల్లర్లకు పాల్పడుతున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకలో హిజాబ్ వివాదమే ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ క్రమంలో ఓ ముస్లిం వ్యక్తి హిందూ దేవాలయాన్ని నిర్మించి.. భారతదేశం అంటే మతసామరస్యానికి నిజమైన ప్రతీక అని మరోసారి చాటి చెప్పారు. పైగా ఈ ఘటన జరిగింది కూడా కర్ణాటకలోనే కావటం విశేషం.
కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లాలోని చిక్కహోళె రిజర్వాయర్ దగ్గర రెహ్మాన్ అనే వ్యక్తి గేట్ కీపర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం రిజర్వాయర్ దగ్గర గణపతి ఆలయాన్ని నిర్మించారు. తన పింఛన్ డబ్బుతో రెహ్మాన్ ఆలయాన్ని నిర్మించడమే కాదు. గుడిలో ఒక పూజారిని కూడా పెట్టి నెలకు రూ.4000ల జీతం కూడా అందిస్తున్నారు. అలాగే ప్రతి సోమవారం, శుక్రవారం పువ్వులను, పూజాసామాగ్రిని ఆలయంలో ఏర్పాటు చేసి, ఆ రెండు రోజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆలయానికి వచ్చే భక్తులకు రెహ్మాన్ స్వయంగా ప్రసాదాన్ని అందిస్తారు. ఇది ప్రతివారం జరుగుతోంది.
ముస్లిం అయి ఉండి హిందూ దేవాలయాన్ని నిర్మించటం పట్ల అతడిపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే దీనిపై రెహ్మాన్ స్పందిస్తూ.. కొన్ని ఏళ్ల క్రితం చిక్కహోళె ఆనకట్ట సమీపంలోని బండరాయిపై ఓ విగ్రహం చోరీకి గురైందని చెప్పారు. ఆ తర్వాత తనకు దైవిక శక్తుల నుంచి కొన్ని సూచనలు వచ్చాయని, దానిని మాత్రమే అమలు చేశానని అంటున్నారు.
ఈ మేరకు స్థానిక ఋషులను సంప్రదించి గణేశుడి విగ్రహాన్ని తీసుకురావడానికి తమిళనాడు వెళ్లానిని రెహ్మాన్ అన్నారు. అంతేకాదు, ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత మాటల్లో చెప్పలేని ఆధ్యాత్మికతను అనుభవించానని తెలిపారు. ఒక్కడే దేవుడు.. ఒక ముస్లింనైనా తాను ఆలయాన్ని నిర్మించినంత మాత్రాన ఆ వాస్తవం మారిపోదని, కానీ అకస్మాత్తుగా అలాంటి బేధాలు ఎలా వస్తున్నాయనేది తనకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు.
” ఆలయం నిర్మించి నాలుగేళ్లు అయింది. దానికోసం నా పింఛన్ డబ్బును ఖర్చు చేశాను. దానిపై నా కుటుంబం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను హిందూ ఆలయాన్ని నిర్మించినందుకు నా మతానికి సంబంధించిన సభ్యులు కూడా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు” అని ఈ సందర్భంగా రెహ్మాన్ చెప్పారు.
కాగా, కర్ణాటకలో ప్రస్తుతం చెలరేగుతున్న వివాదాలకు సంబంధించి ప్రశ్నిస్తే.. ప్రజలు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని రెహ్మాన్ అంటున్నారు. మనుషుల్లో తేడా అనేది ఏమన్న ఉంటే అది ఆడ, మగ అనే తేడా మాత్రమేనని ఆయన అన్నారు. అంతకు మించి ఎటువంటి భేదాలు లేవన్నారు. అందరిలోనూ ఒకటే రక్తం ఉందని, మరింకేం తేడాలు లేవని ఆయన అన్నారు.