మహ్మాద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జాతీయ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను బీజేపీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి నూపుర్ ను బహిష్కరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. శర్మ తో పాటు నవీన్ జిందాల్ ప్రాథమిక సభ్యత్వాన్ని బీజేపీ రద్దు చేస్తూ.. పార్టీ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేశారు.
ఖతార్, కువైట్ తమ దేశంలోని భారత రాయబారుల్ని పిలిపించి.. అధికారికంగా నిరసనలు తెలిపే లేఖల్ని అందజేశాయి. ఆ వ్యాఖ్యలు ఎంతమాత్రం భారత ప్రభుత్వ అభిప్రాయాలు కావని రాయబారులు స్పష్టంచేశారు. అనంతరం బీజేపీ తీసుకున్న చర్యలపై ఆయా దేశాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. భారత్ లో బీజేపీ నేతలు బాధాకరమైన వ్యాఖ్యలు చేశారని పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ ఖండించారు. మత స్వేచ్ఛను, ముఖ్యంగా ముస్లింల హక్కులను భారత్ కాలరాస్తోందని ఆరోపించారు.
జ్ఞానవాపి మసీదులో వెలుగుచూసిన శివలింగం సహా వివిధ అంశాల్లో హిందూ మతాన్ని కించపరుస్తున్నవారి మాటేమిటి అని మాత్రమే తాను ప్రశ్నించాను అని.. ఎవరినీ తక్కువచేసి చూపే ఉద్దేశం లేదని జిందాల్ తెలిపారు. తనను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. హిందూమత విశ్వాసాల గురించి కొందరు అవహేళనగా మాట్లాడడంతో తాను సహించలేక స్పందించానని పేర్కొన్నారు. బేషరతుగా ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నానని నూపుర్ శర్మ తన సస్పెన్షన్ అనంతరం ట్వీట్ చేశారు.
మత ప్రాతిపదికన విభజన తీసుకువచ్చి దేశాన్ని చీకట్లోకి నెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఆరోపించారు. శాంతిభద్రతల దృష్ట్యా నేతలపై ఇలాంటి చర్యలు అవసరమని జమాత్ ఉలామా ఏ హింద్ పేర్కొంది.
ఇదిలా ఉంటే.. పార్టీ నియమావళికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేసి, మత సామరస్యతను దెబ్బతీసిన దృష్ట్యా ఇద్దరు నేతలపై చర్యలు తీసుకుంటున్నట్లు బీజేపీ క్రమశిక్షణ సంఘం తెలిపింది. వేల ఏళ్లలో భారత్ లో ప్రతీ మతం విలసిల్లుతూ వచ్చిందని పార్టీ నేత అరుణ్ సింగ్ గుర్తుచేశారు. అన్ని మతాలనూ గౌరవిస్తామనీ, కించపరిచేందుకు ఎవరు ప్రయత్నించినా సహించేది లేదని స్పష్టంచేశారు.
Advertisements
ఈ మేరకు బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. ఏ మతం లేదా వర్గ మనోభావాలను దెబ్బతీసే అలాంటి ఆలోచనలను తమ పార్టీ అంగీకరించదని అన్నారు. అటువంటి ఆలోచనను బీజేపీ అంగీకరించదని, ప్రోత్సహించదని ఆయన వెల్లడించారు. శర్మ ప్రకటనపై ముస్లిం సమాజంలో ఆగ్రహం వ్యక్తం కావడం గమనార్హం.