ఓ వైపు పెళ్లి అయినప్పటికీ పెద్దల అంగీకారం లేకుండా మళ్లీ పెళ్లి చేసుకున్న ఓ జంట రక్షణ కోసం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో ఆ జంటకు న్యాయమూర్తి షాక్ ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి బాంబే హై కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ముంబైకి చెందిన ఓ ముస్లిం జంటకు ఇది వరకే వేర్వేరుగా పెళ్లిళ్లు అయ్యాయి. అయితే ఆ పెళ్లిళ్లు వారికి నచ్చలేదు. దీంతో తమ పార్ట్‌నర్స్‌తో వారు విడాకులు కూడా తీసుకోలేదు. పెద్దలు కూడా అంగీకరించలేదు. అయినప్పటికీ వారు తమ పార్ట్‌నర్స్‌ను విడిచి పెట్టి బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నారు. తరువాత తమకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని బాంబే హైకోర్టులో పిటిషన్ పెట్టుకున్నారు.
కాగా వారి పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అల్కా సారిన్ నేతృత్వంలోని ధర్మాసం తాజాగా తీర్పు ఇచ్చింది. ఆ ఇద్దరికీ పెళ్లి అయినప్పటికీ ఆ మహిళ తన మొదటి భర్తకు విడాకులు ఇవ్వలేదని కనుక రెండో పెళ్లి చెల్లదని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. అయితే ఈ విషయం ఆ వ్యక్తికి వర్తించదని, అతను మొదటి భార్యకు విడాకులు ఇవ్వకపోయినా, ఆమె అనుమతి లేకున్నా ఇంకా పెళ్లిళ్లు చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. కనుక ఆ వ్యక్తికి సంబంధించినంత వరకు అతనికి ఆ రెండో పెళ్లి చెల్లుతుందని, కానీ ఆ మహిళ విషయంలో ఆ పెళ్లి చెల్లదని తీర్పు ఇచ్చారు. ఆమె ముస్లిం చట్టాల ప్రకారం మొదటి భర్తకు విడాకులు ఇచ్చాకే రెండో పెళ్లి చేసుకోవాలని తీర్పు ఇచ్చారు. ఇక వారికి రక్షణ కావాలంటే పోలీసులను ఆశ్రయించవచ్చని, అయినప్పటికీ వారి పెళ్లి చెల్లదని చెప్పారు. దీంతో ఆ జంట షాకైంది.