పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా బుధవారం చెన్నైలో వేలాది మంది ముస్లింలు నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నారు. పోలీసులు ర్యాలీకి అనుమతి నిరాకరించినప్పటికీ లెక్కచేయకుండా దాదాపు 15000 మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సెక్రెటేరియట్, జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని చుట్టుముట్టాలని నిరసనకారుల ప్రయత్నమని పోలీసులు చెబుతున్నారు. హైకోర్ట్ ఆదేశాల మేరకు నిరసన ర్యాలీ తమిళనాడు అసెంబ్లీ వైపు వెళ్లడం లేదని కొందరు నిరసనకారులు తెలిపారు. అయితే పిటిషన్ లో తాము రెస్పాండెంట్స్ కానందున హైకోర్టు ఆదేశాలు తమకు వర్తించవని మరికొన్ని మస్లిం సంఘాలు తెలిపాయి. సీఏఏ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు.
తమిళనాడులోని అధికార ఏఐఏడీఎంకె పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు ప్రకటించింది. పొరుగు దేశాల నుంచి వచ్చిన ముస్లింయేతర మైనార్టీలకు పౌరసత్వం ఇవ్వడానికి ప్రక్రియను వేగవంతం చేసింది. సీఏఏతో భారతీయ పౌరులకు ఎలాంటి నష్టం లేదని ఏఐఏడీఎంకె ప్రకటించింది.