బీజేపీ ముస్లిం వ్యతిరేకి.. వారి పాలనలో మైనారిటీలకు భద్రత లేదు.. దాడులు పెరిగిపోయాయి.. ఇలాంటివన్నీ తరచూ ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు. కానీ.. వాస్తవంగా జరుగుతోంది వేరని చెబుతున్నారు బీజేపీ శ్రేణులు. భోపాల్ లో కనిపించిన దృశ్యమే అందుకు నిదర్శనమని అంటున్నారు.
ప్రధాని మోడీ నూతనంగా నిర్మించిన ప్రపంచస్థాయి రాణి కమలాపతి రైల్వే స్టేషన్ ను ప్రారంభించేందుకు భోపాల్ వెళ్లారు. ఈ సందర్భంగా మార్గమధ్యంలో రోడ్డు పక్కన నిలబడిన ముస్లిం మహిళల గుంపు కనిపించింది. వీరంతా మోడీ పర్యటనను వ్యతిరేకించేందుకు వచ్చారని అందరూ భావించారు. కానీ.. ప్రధాని కాన్వాయ్ దగ్గరకు రాగానే మోడీ ఫోటోలతో ఉన్న ప్లకార్డులను, జాతీయ జెండాను చేతబూనారు.
ట్రిపుల్ తలాక్ అంశంలో మోడీ ప్రభుత్వం చేసింది ముమ్మాటికీ ముస్లిం మహిళలకు ఓ వరమే. 2019 జూలై 30న ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధంగా ప్రకటిస్తూ పార్లమెంట్ లో చట్టాన్ని ఆమోదించింది కేంద్రం. ఈ నిర్ణయం తర్వాత మోడీకి ముస్లిం మహిళల్లో ఫాలోయింగ్ బాగా పెరిగింది. అందుకే వీరంతా ఆయనకు కృతజ్ఞత చెప్పేందుకు వచ్చారని చెబుతున్నారు బీజేపీ నేతలు.